Home ప్రత్యేకం జంపర్స్, జోకర్స్‌తో నిండుతున్న జనసేన!

జంపర్స్, జోకర్స్‌తో నిండుతున్న జనసేన!

SHARE

గత ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ తన పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడుతూ.. ఒక మాట అన్నాడు. తన పార్టీలోకి ఎవరు చేరాలి, ఎవరు చేరకూడదో కూడా పవన్ అప్పట్లోనే స్పష్టం చేశాడు. తన పార్టీలో ‘జోకర్స్‌కు జంపర్స్’కు స్థానం లేదని పవన్ కల్యాణ్ అప్పట్లో గొప్పగా ప్రకటించుకున్నాడు. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు తన పార్టీలో చోటు లేదని అప్పట్లో పవన్ అలా ప్రకటించాడు.

ఇక నాలుగేళ్లుగా జనసేనలోకి ఎలాంటి చేరికలూ లేవు. పవన్ కల్యాణే తన పార్టీ నిర్మాణాన్ని ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ పనేదో చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. ఇప్పుడు జనసేన నిండా జంపర్స్ కనిపిస్తున్నారు. పవన్ మాటల్లోనే చెప్పాలంటే జనసేన ఇప్పుడు జంపర్స్‌కు జోకర్స్‌కు ఆస్థానం అవుతోంది.

తాజాగా ఇద్దరు నేతలు జనసేనలోకి చేరారు. వీరు పాముల రాజేశ్వరి, రాపాక వరప్రసాద్. వీరు మాజీలు. వివిధ పార్టీలు తిరిగి వచ్చిన వాళ్లే. వీళ్లు మాత్రమే కాదు.. ఇటీవలి కాలంలో గోదావరి జిల్లాలో జనసేనలోకి చేరిన నేతలంతా కూడా.. ఈ తరహా నేపథ్యం ఉన్న వాళ్లే.

ఏదో ఒక పార్టీలో గతంలో పని చేసి ఉండటం, ఆ పార్టీలో టికెట్ రాదని క్లారిటీ రావడం.. అప్పుడు పక్క చూపులు చూడటం.. ఇలాంటి వాళ్లే ఇప్పటి వరకూ జనసేనలోకి చేరారు. చేరుతున్నారు. ఎవరికైతే తన పార్టీలో చోటు లేదు అని పవన్ కల్యాణ్ అన్నాడో.. ఇప్పుడు జనసేన నిండా అలాంటి వాళ్లే కనిపిస్తూ ఉన్నారు. ఈ పవన్ కల్యాణ్ చెప్పేదొకటి చేసేది ఒకటి అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేం రుజువు కావాలబ్బా?