Home రాజకీయాలు మళ్లీ సినిమాలు.. పవన్ పొలిటికల్ షో ముగింపుకు?

మళ్లీ సినిమాలు.. పవన్ పొలిటికల్ షో ముగింపుకు?

SHARE

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ రాజకీయం ముగింపు దశకు వచ్చిందా? పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాతి ప్రణాళికల్లో ఉన్నాడా? గత కొన్నాళ్లుగా తన పార్టీ తరఫున హడావుడి చేస్తున్న పీకే.. ఇప్పుడు మళ్లీ సినిమాలను ఒప్పుకుంటున్నాడనే వార్తలతో కొత్త సందేహాలు తలెత్తుతున్నాయి. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఇప్పటికే ఐదేళ్లు కావొస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఈ పార్టీకి ఒక రూపం అంటూ లేదు. మొదట్లోనే బీజేపీ, టీడీపీల భజన సరిపోయింది. అలా నాలుగేళ్లు గడిచాకా కానీ తన పార్టీ తరఫున పవన్ పని మొదలుపెట్టలేదు.

ఇక నాలుగు రోజులు పోరాటయాత్రలు.. పక్షం రోజులు విశ్రాంతి అన్నట్టుగా ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాజకీయం సాగుతూ ఉంది. వచ్చే ఎన్నికల విషయంలో మొదట్లోనేమో అధికారం కావాలన్నాడు, ముఖ్యమంత్రి అవుతానన్నాడు. ఆ తర్వాత అధికారం కోసం కాదు అన్నాడు. ఆపై జాక్ పాట్ గా ముఖ్యమంత్రిని అయిపోతా అని ప్రకటించుకున్నాడు. ఇలా దినానికి ఒక ప్రకటన చేసుకొంటూ వస్తున్నాడు పీకే.

ఇక ఇప్పుడు పవన్ మళ్లీ సినిమాల మీద కన్నేశాడని వార్తలు వస్తున్నాయి. ఒక భారీ ప్రాజెక్టులో నటించడానికి పవన్ సైన్ చేసినట్టుగా సినీ విశ్లేషకులు అంటున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానున్నదని చెబుతున్నారు. ఎన్నికలు కాగానే పవన్ కల్యాణ్ ఆ సినిమాలో నటించడం మొదలుపెడతాడని.. ఇప్పటికే అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నడుస్తోందని వార్తలు వస్తున్నాయి.

ఇదీ కథ.. జనసేన అధిపతి ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల తర్వాత సినిమాల్లో మళ్లీ కొనసాగడానికి సమాయత్తం అవుతున్నాడని స్పష్టం అవుతోంది. మరి ఎన్నికల వరకూ అయినా ఆగుతాడా? లేక ఎన్నికల ముందే పొలిటికల్ షోకు శుభం కార్డు వేసి.. మళ్లీ సినిమాలతో బిజీ అవుతాడా? ఏమైనా జరగొచ్చు. దటీజ్ పవన్ కల్యాణ్.