Home రాజకీయాలు తెలంగాణ ఎన్నికలు..కేసీఆర్ అనుకున్నట్టుగా!

తెలంగాణ ఎన్నికలు..కేసీఆర్ అనుకున్నట్టుగా!

SHARE

మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో నెలకొని ఉండిన ప్రతిష్టంభన పూర్తిగా తొలగిపోయింది. కేసీఆర్ కోరుకుంటున్నట్టుగా ముందస్తు ఎన్నికలు వస్తాయా? లేక లాస్ట్ మినిట్ ట్విస్ట్ ఏమైనా ఉంటుందా? అని అనేక మంది రకరకాల విశ్లేషణలు చేశారు. కేసీఆర్ కు కేంద్ర సహకరిస్తుందా? ఆయన కోరినట్టుగా ముందస్తు ఎన్నికలకు కేంద్రం ఓకే చెబుతుందా? అనే విషయంపై చర్చోపచర్చలు సాగాయి. అయితే ట్విస్టులు ఏమీ లేకుండా.. అంతా కేసీఆర్ అనుకున్నట్టుగా సాగుతోంది. తెలంగాన అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది.

నవంబర్ 12న తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలు అవుతుంది. నవంబర్ ఇరవయ్యవ తేదీ వరకూ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 22. డిసెంబర్ ఏడో తేదీన తెలంగాణ ఎన్నికల పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 11న మిగతా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా విడుదల అవుతాయి.

ఏమైనా ట్విస్టు ఉంటుందా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆగుతాయా? అనే అంశం గురించి నిన్నటి వరకూ నడిచిన చర్చకు ఇక పూర్తిగా ఫుల్ స్టాప్ పడినట్టే. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆగే అవకాశాలు లేవు. అయిష్టంగా అయినా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఎన్నికలను ఎదుర్కొనాల్సిందే.

ఇక కేసీఆర్ కు కొత్త ఉత్సాహం వచ్చినట్టే. ఏదైనా జరిగి ఎన్నికలు ఆగుతాయేమో.. సార్వత్రిక ఎన్నికలకూ వరకూ వాయిదా పడతాయేమో అనే భయాలు ఇక తొలగిపోయినట్టే. ఇక మిగిలింది హోరాహోరీ పోరే. విజయం సాధిస్తామనే వందశాతం విశ్వాసంతో కనిపిస్తున్నాడు కేసీఆర్. అదెలా ఉంటుందో.. డిసెంబర్ 11వ తేదీన అర్థం అవుతుంది.