Home రాజకీయాలు టీడీపీ టికెట్లు.. బాబు చూస్తున్న అర్హతలవే!

టీడీపీ టికెట్లు.. బాబు చూస్తున్న అర్హతలవే!

SHARE

వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తును మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయన కొన్ని టికెట్ల విషయంలో లీకులు ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడి రాజకీయం ఇలానే ఉంటుంది. ఏదీ డైరెక్టుగా చెప్పడం ఉండదు. ముందుగా లీకులు ఇవ్వడం.. దానిపై వచ్చే ప్రతి స్పందనను చూడటం.. ఒకవేళ నెగిటివ్ రెస్పాన్స్ వస్తే చంద్రబాబు కామ్ అయిపోతాడు. అదంతా రూమర్లే అని అంటాడు. అలా కాకుండా పాజిటివ్ అనుకుంటే.. ఆ లీకులనే నిజం చేస్తాడు.

బ్యాక్ డోర్ పాలిటిక్స్ చంద్రబాబుకు అలవాటు అయినవే. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా లీకుల రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ఎంపీ టికెట్ల విషయంలో, తాజాగా ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కూడా బాబు లీకులు ఇవ్వడం గమనార్హం. బాగా ధనబలం ఉన్న ఎంపీలందరికీ మళ్లీ టికెట్లను ఖరారు చేశాడట చంద్రబాబు నాయుడు. 25 సీట్లలో పన్నెండు సీట్లకు సిట్టింగులు కమ్ వందల కోట్లను సంపాదించిన నేతలను చంద్రబాబు నాయుడు మళ్లీ టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడని తెలుస్తోంది.

వీరిలో బాగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నేతలు కూడా కొందరున్నారు. అయినప్పటికీ వారినే చంద్రబాబు నాయుడు మళ్లీ అభ్యర్థులుగా నిలపడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. దీనికి కారణం ఏమిటంటే.. వారి ధన బలమే అని తెలుస్తోంది. ఇక తాజాగా రెండు ఎమ్మెల్యే సీట్ల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇది కూడా లీకేజీ రాజకీయమే.

తాజా లీకేజీలో మంత్రులు నారాయణ, కాలువ శ్రీనివాసులు ఉన్నారు. వీరిలో కాలువకు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం టికెట్ నే బాబు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మంత్రి నారాయణ తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నాడట. ఆయనకు నెల్లూరు సిటీని బాబు ఖరారు చేసినట్టుగా సమాచారం.

విశేషం ఏమిటంటే.. వీళ్లిద్దరూ కోటీశ్వరులే. నారాయణ ఆర్థిక శక్తి గురించి ఎవరికీ చెప్పనక్కర్లేదు. ఇక కాలువ శ్రీనివాసులు గత నాలుగేళ్లలో భారీగా సంపాదించాడని అనంతపురం టీడీపీ వర్గాలు అంటున్నాయి. వంద కోట్ల రూపాయలకు పైనే అక్రమ సంపాదన ఉంది ఈ మంత్రిగారికి అని టాక్. వీళ్ల సంపాదనలే అర్హతలుగా భావించి చంద్రబాబు నాయుడు టికెట్లను ఖరారు చేస్తున్నట్టుగా ఉన్నాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది.