Home రాజకీయాలు ఏపీలో ఆ రెండు సీట్లకూ ఉపఎన్నికలు వస్తాయా?

ఏపీలో ఆ రెండు సీట్లకూ ఉపఎన్నికలు వస్తాయా?

SHARE

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరెంతో సమయం లేదు. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలున్నాయి. అంటే దాదాపు ఐదు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా రావొచ్చు. మే నెల ఆరంభంలో పోలింగ్ జరిగే అవకాశాలుంటాయి. అయితే ఇంతలో ఏపీలో ప్రజాప్రతినిధుల మరణాలు ఉప ఎన్నికలకు కారణం అవుతాయా? అనే అంచనాలకు కారణం అవుతున్నాయి.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోల చేతిలో హత్యకు గురి అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే సీటు ఖాళీ అయ్యింది. అలాగే విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అమెరికాలో యాక్సిడెంట్లో మరణించారు. ఈ విధంగా విశాఖ జిల్లాకే చెందిన రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. ఒక ఎమ్మెల్యే సీటు మరోటి ఎమ్మెల్సీ సీటు.

ఈ నేపథ్యంలో వీటికి ఉప ఎన్నికలు జరుగుతాయా? అనే ప్రశ్న జనిస్తోంది. కానీ..ప్రస్తుతానికి అయితే ఉప ఎన్నికలు లేనట్టే. ఎందుకంటే కిడారి సర్వేశ్వరరావు సీటుకు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. పదవీ కాలం మరింత ఉన్నప్పటికీ సార్వత్రిక ఎన్నికలకు మరెంతో సమయం లేని నేపథ్యంలో ఈసీ కూడా ఎన్నికలకు వచ్చేంత వరకూ ఆ సీటును ఖాళీగానే ఉంచే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ ఎంపీల రాజీనామాలో ఆమోదం పొందాయి. ప్రత్యేకహోదా ఆకాంక్షతో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. అవి ఆమోదం పొంది కూడా నెలలు గడిచాయి. అయినా ఉప ఎన్నికలు వచ్చేలా లేవు. కాబట్టి అరకుకు బై పోల్ వచ్చే ఛాన్సే లేదు.

ఇక ఎమ్మెల్సీ మూర్తి సీటుకు మాత్రం ఉప ఎన్నిక అనివార్యం. కానీ ఇప్పుడప్పుడే జరిగాలని ఏమీ లేదు. మూర్తి పదవీ కాలం ఇంకా ఉండగానే ఆయన మరణించారు. కానీ ప్రస్తుతానికి ఈసీ ఆ సీటుకు బై పోల్ ను తీసుకురాదని.. సార్వత్రిక ఎన్నికలు అయ్యేంత వరకూ కూడా ఆ సీటును ఖాళీగానే ఉంచవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.