Home రాజకీయాలు ఎన్టీఆర్ కు బాబు రెండో వెన్నుపోటు!

ఎన్టీఆర్ కు బాబు రెండో వెన్నుపోటు!

SHARE

ఆనాడు పదవి కోసం ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు…..ఈ రోజు మళ్ళీ పదవి కోసం కాంగ్రెస్ తో కలిసి ఎన్టీఆర్ ఆత్మకు రెండో వెన్నుపోటు పొడిచారని కేటీఆర్ అన్నారు.

కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత విజేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకే టీడీపీ ని ఏర్పాటు చేసినట్టు ఆ నాడు ఎన్టీఆర్ చెప్పారని, అటువంటి కాంగ్రెస్ పార్టీ కి టీడీపీ తోక పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు.

‘‘ఐదు సీట్లివ్వు..పది సీట్లివ్వు.. పదిహేను సీట్లివ్వు’ అంటూ కాంగ్రెస్ పార్టీ ని ‘భిక్షాందేహి’ అంటూ అడుక్కుతినే పరిస్థితి కి టీడీపీ ని తీసుకొచ్చారన్నారు. ఎన్టీఆర్ ఆత్మకు రెండోసారి వెన్నుపోటు పొడిచిన నాయకుడెవరైనా ఉన్నారంటే అది చంద్రబాబునాయుడే’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గతం లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసిన కాంగ్రెస్, టీడీపీలు తాము గెలిచిన సీట్లను ‘ఏక్ దో తీన్’ అంటూ లెక్కపెట్టుకున్నాయని గుర్తు చేశారు. కేసీఆర్ ని గద్దె దించాలన్నదే కాంగ్రెస్ పార్టీ అభిమతమని అందుకే ఆ పార్టీ చెప్పే బూటకపు హామీలు నమ్మొద్దు అన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చాలంటే మొత్తం దక్షిణ భారతదేశం బడ్జెట్ కూడా సరిపోదని విమర్శించారు.

రాహుల్ గాంధీ మొహం చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేవాళ్లు కూడా వేయరని ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. రాహుల్ గాంధీ కాలు పెడితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఆనవాయితీ అని అన్నారు. సీఎం కేసీఆర్ పై ప్రజల్లో బలమైన విశ్వాసం ఉందని, పాలేరు, నారాయణఖేడ్ ఉపఎన్నికల తీర్పు కేసీఆర్ పై నమ్మకానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు.