Home ప్రత్యేకం వైఎస్‌ జగన్‌ @ 3000 కి.మీ.. చారిత్రక ఘట్టంపై ట్వీట్‌

వైఎస్‌ జగన్‌ @ 3000 కి.మీ.. చారిత్రక ఘట్టంపై ట్వీట్‌

SHARE

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జనం కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో సోమవారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా, ఎస్‌కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాసంకల్పయాత్ర 3000 కిలోమీటర్ల పైలాన్‌ను జననేత వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. అదేవిధంగా ఈ మైలురాయికి గుర్తుగా రావి మొక్కను అక్కడ నాటారు. చారిత్రాక ఘట్టానికి సాక్షులుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆ రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. జననేత పాదయాత్ర 3000 కిలోమీటర్లు చేరుకున్నవేళ తెలుగు రాష్ట్రాలతోపాటు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంఘీభావ యాత్రలు కొనసాగాయి.

ప్రజాసంకల్పయాత్రలో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించడం పట్ల వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజాభిమానం దన్నుతో పాదయాత్రలో చారిత్రక ఘట్టాన్ని లిఖించినందుకు హర్షం ప్రకటించారు. తన ఆనందాన్ని ట్విటర్‌ ద్వారా వ్యక్త పరిచారు.

‘ఈరోజు మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలతో కలిసి పాదయాత్ర చేయడం గొప్ప అనుభూతి. నా మీద మీరు చూపించిన ప్రేమ, విశ్వాసం ప్రతిరోజు ప్రేరణ’గా నిలుస్తుందని వైఎస్‌ జగన్ ట్వీట్‌ చేశారు. కాగా, విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెంలో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని జననేత దాటారు.