Home రాజకీయాలు కెసిఆర్ పై నారాయణ ‘శోభనం’ కామెంట్ లోతైనదే

కెసిఆర్ పై నారాయణ ‘శోభనం’ కామెంట్ లోతైనదే

67
SHARE

ఎప్పటికప్పుడు ప్రత్యర్థులపై తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేసే సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ మరోసారి కెసిఆర్ పై తన మార్కు విమర్శలు చేశారు.

పలువురు నేతలపై వివిధ సందర్భాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన నారాయణ ఈ సారి కేసీఆర్ పై ఓ బీభత్సమైన సెటైరే వేశారు. కేసీఆర్‌ శోభనం గది నుంచి మధ్య రాత్రి పారిపోయిన పెళ్లి కొడుకు మాదిరి లా ఉందని నారాయణ ఎద్దేవా చేశారు.

అటువంటి పెళ్ళికొడుకు మళ్లీ పెళ్లి చేయండి..సత్తా చాటుతా, దుమ్ము దులుపుతా, పొడిచేస్తా, చించేస్తా.. అన్నట్లు ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా 9 నెలల కాలం పరిపాలనకు అవకాశం ఉండగా,ఇప్పుడే ఎన్నికల కు ఏం తొందరని నిలదీశారు.

పైగా ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికలు జరిగే సమయం కూడా కేసీఆర్ చెప్పడం విడ్డూరాతి విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ పూర్తిగా లక్ష్మణరేఖ దాటారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ వ్యవహారశైలి ఎన్నికల సమయం చెప్పడం పై ఈసీ ప్రధానాధికారి కూడా విచారం వ్యక్తం చేశారని నారాయణ తెలిపారు.

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా కేసీఆర్ పై మండిపడ్డారు. ప్రత్యర్ధులను, రాజకీయాల్లో అనుభవజ్ఞులను దద్దమ్మలు, సన్నాసులు, పనికిమాలినోళ్లు అని నోరు పారేసుకునే కేసీఆర్ కుసంస్కారి అని అన్నారు. ఢిల్లీలో నారాయణతో కలసి సురవరం మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ ముందస్తు ఉత్సాహం ప్రజలు నీరుగారుస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషన్‌ను నిర్దేశించేలా, ప్రభావితం చేసేలా, కేసీఆర్‌ ప్రకటనలు దారుణ౦ అని మండిపడ్డారు. కేసీఆర్‌ ది ముమ్మాటికీ కుటుంబ క్యాబినేట్‌, అని కుటుంబ౦ అంతా మాట్లాడుకుని, కేవలం రెండు నిమిషాల్లో అసెంబ్లీని రద్దు చేస్తూ క్యాబినేట్‌ తీర్మానం చేశారని విమర్శించారు. టీఆర్ఎస్ ఒక ఏక వ్యక్తి పార్టీ అని ఈ సంఘటనే నిరూపించిందన్నారు.

కనీస౦ పొలిట్ బ్యూరో తో చర్చ జరపకుండా 105 మంది అభ్యర్థుల పేర్లు విడుదల చేయడం కేసీఆర్ నియంతృత్వ పాలనకు అడ్డం పడుతోందని అన్నారు. ఇలాంటి నియంతలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని సీపీఐ నేతలు విజ్ఞప్తి చేశారు.