Home రాజకీయాలు హామీలు వడ్డీతో సహా బాబు వసూలు చేస్తారట…మరి తమరిచ్చినవి సార్?

హామీలు వడ్డీతో సహా బాబు వసూలు చేస్తారట…మరి తమరిచ్చినవి సార్?

SHARE

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వడ్డీతోసహా వసూలు చేసే బాధ్యత తనదే అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. హామీలన్నీ అమలు అయ్యేదాకా తెలుగోడి సత్తా, తెలుగోడి దెబ్బ ఏంటో కేంద్రానికి రుచి చూపిస్తామని హెచ్చరించారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతా ద్వారా చంద్రబాబు ట్వీట్ల రూపంలో ఇది తెలియచేసారు. ఎన్టీఆర్ స్పూర్తి గా పార్లమెంట్‌ లో తమ ఎంపీలు బొబ్బిలిపులి వలే పోరాడారని చెప్పటానికి గర్వపడుతున్నాని పేర్కొన్నారు.

అమరావతి శంకుస్థాపనకు పార్లమెంట్ నుండి మట్టి, యమునా నది నుండి నీరు తెచ్చి మరీ హామీ ఇచ్చారని, ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ఐదు కోట్ల ప్రజల తరఫున నిలదీస్తున్నానని చంద్రబాబు అడిగారు. తెలుగు జాతి చిరకాల కాంక్ష పోలవరమని అటువంటి పోలవరానికి కేంద్రం ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టిస్తోందని ఫైర్ అయ్యారు. డీపీఆర్‌ ను ఆమోదించి కూడా కేంద్ర౦ నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. పోలవరం తన జీవిత లక్ష్యమని, దానిని పూర్తి చేసి ఏపీ ని కరువురహిత రాష్ట్రంగా చేస్తానని బాబు హామీ ఇచ్చారు.

నిన్న కర్నూలులో జరిగిన ధర్మపోరాట సభలో పాల్గొన్న బాబు సుదీర్ఘంగా మాట్లాడారు. ఐదుకోట్ల మంది ఆంధ్రుల అండతో కొండ నైనా బద్దలు చేసే౦త శక్తి టీడీపీ కి ఉందని బాబు అన్నారు. మోసం చేసిన వారిని వదిలిపెట్టడం తెలుగు వారి లక్షణం కాదని.. మోదీ ప్రభుత్వం పై కసి తీర్చుకుందామని పిలుపునిచ్చారు. నాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారి గుండెల్లో ఎలా రైళ్లు పరుగెత్తించారో.. నేడు మోదీ గుండెల్లో అలానే రైళ్లు పరుగెత్తించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మరి, అదే తమరిచ్చిన హామీలు తీర్చనందుకు విపక్షాలు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే సమాధానమేది బాబు గారు? సరిగ్గా మీరు ఉద్ఘాటించినట్టే వైకాపా అధినేత కూడా హామీలు ఇచ్చి నిలుపుకోని మిమ్మల్ని ఓడించాలని చెప్తున్నారు కదా…..మీరన్న దాంట్లో మీకెంత న్యాయం ఉందొ…ఇందులోనూ అంతే న్యాయం వుంది కదండీ….సరే చెల్లుకి చెల్లు అనుకోండి ప్లీజ్!!