Home రాజకీయాలు ప్రతి వ్యవస్థలో నీ గడ్డి తినే మనుషులున్నారు.. అయినా నీ వల్ల కాదు…

ప్రతి వ్యవస్థలో నీ గడ్డి తినే మనుషులున్నారు.. అయినా నీ వల్ల కాదు…

SHARE

ప్రజాక్షేతంలో జగన్‌ను ఎదుర్కోవడం చేతగాక చంద్రబాబు మరోసారి కుట్రరాజకీయాలకు తెరలేపారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వాటిని తట్టుకునే నిలబడే శక్తి తమ పార్టీకి ఉందన్నారు.

చివరకు వైఎస్ భారతీపైనా కేసులు పెట్టించే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారన్నారు. ప్రతి వ్యవస్థలోనూ చంద్రబాబు తన మనుషులను ప్రవేశపెట్టి వ్యవస్థల ద్వారా వైసీపీని దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. ప్రతి వ్యవస్థలోనూ చంద్రబాబు పెట్టే గడ్డి తినే మనుషులున్నారన్నారు.

గతంలో జగన్‌ను జైలుకు పంపినా విజయమ్మ, షర్మిలమ్మతో పార్టీని బతికించుకున్నామని అంబటి చెప్పారు. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదన్నది చంద్రబాబు గుర్తించుకోవాలన్నారు.

బీజేపీతో వైసీపీ కుమ్మక్కు అయిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కళావెంకట్రావ్ చెబుతున్నారని.. మరి అదే నిజమైతే ఈడీ వైఎస్ భారతీ జోలికి వచ్చేదా అని ప్రశ్నించారు. ఈడీలో ఉన్న ఉమాశంకర్ గౌడ్, గాంధీల కాల్ డేటా తీస్తే వారితో టీడీపీ పెద్దలకు ఉన్న సంబంధాలేంటో బయటకు వస్తాయన్నారు.

భారతీయన్యాయవ్యవస్థ జగన్‌ అనుకుంటున్నంత బలహీనమైనది కాదని లేఖలో రాసిన కళావెంకట్రావ్‌.. అదే లేఖలో మరో చోట కాంగ్రెస్‌తో లాలూచీపడడం వల్లే జగన్‌కు బెయిల్ వచ్చిందని రాశారని అంబటి వివరించారు.

ఇలా ఒకలేఖలో పొంతనలేని వ్యాఖ్యలు చేసేందుకు సిగ్గుందా అని కళాను నిలదీశారు. మోడీని ఎప్పుడు కలిసినా జగన్‌ను ఎప్పుడు జైలుకు పంపుతారని చంద్రబాబు అడిగే వారని.. ఇప్పుడు బీజేపీ నేతలే బహిరంగంగా చెబుతున్నారని.. దీనిపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

పత్రికల్లో మొదటి పేజీల్లో తప్పుడు కథనాలు రాయించడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. హెరిటేజ్ గ్రూప్‌లో ఎన్ని కుంభకోణాలు జరిగాయో సమయం వచ్చినప్పుడు అవన్నీ బయటకు వస్తాయన్నారు.

జగన్‌ కుటుంబంలో ఎంత మంది మీద కేసులు పెట్టినా వైసీపీని ఏమీ చేయలేరన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించుకోవాలన్నారు అంబటి. చివరకు వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఆదినారాయణరెడ్డి కూడా ఈ రాష్ట్రంలో నీతులు చెబుతున్నారని అంబటి మండిపడ్డారు.