Home రాజకీయాలు జేసీ లోటస్‌నాదం

జేసీ లోటస్‌నాదం

142
SHARE

చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మారుస్తోంది. కమ్యూనిస్టుల నుంచి టీఆర్‌ఎస్ వరకు అన్ని పార్టీలతో సిద్ధాంతాలతో సంబంధం లేకుండా చెలిమి చేసిన చంద్రబాబు..ఇప్పుడు కాంగ్రెస్‌ పక్కలో చేరారు.

టీడీపీ ఆవిర్భావ ఉద్దేశానికే సమాధి కంటే కాంగ్రెస్‌ పంచన చేరారు. అయితే ఆ పార్టీతో కూడా మనస్పూర్తిగా కాపురం చేసే సూచనలు కనిపించడం లేదు. బీజేపీతో ఇప్పటికీ సంబంధాలు నడుపుతూనే ఉంది. భవిష్యత్తులో కలిసి కాపురం చేసేందుకు అభ్యంతరం లేదని కూడా చెబుతోంది.

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తాము వ్యతిరేకిస్తున్నది మోడీ నాయకత్వాన్ని మాత్రమేనని ఢిల్లీలో చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థిగా బీజేపీ నుంచి మోడీ కాకుండా మరొకరు వస్తే మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. పరోక్షంగా బీజేపీతో దోస్తికి దారులు మూసుకుపోలేదని స్పష్టం చేశారు.

అదే సమయంలో యూపీఏ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని జేసీ చెప్పేశారు. కాంగ్రెస్‌కు సీట్లు పెరగవచ్చు గానీ.. అధికారంలోకి వచ్చేంత ఊపు లేదని తేల్చేశారు. జేసీ వ్యాఖ్యలు బట్టి చూస్తే కాంగ్రెస్‌తో చెలిమి చేస్తున్నా.. తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే సంబంధాలు నెరిపేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగానే ఉంది.