Home రాజకీయాలు కర్నాటకలో బాబు ఖర్చుపై దుమారం

కర్నాటకలో బాబు ఖర్చుపై దుమారం

61
SHARE

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ఖర్చు ఇప్పుడు కర్నాటకలోనూ చర్చకు దారి తీసింది. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరైన సందర్భంగా చంద్రబాబు చేసిన బిల్లు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మే నెలలో కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారుస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలతో పాటు చంద్రబాబు కూడా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి పెట్టిన ఖర్చుపై కర్నాటకలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక నాడు  అతిథుల కోసం ఎంతమేర ఖర్చు చేశారన్న వివరాలను సేకరించి ప్రచురించింది. అతిథుల ఏర్పాట్ల కోసం ఒక రోజే 42 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.  ఆ ఖర్చులో చంద్రబాబు కోసమే అందరి కంటే భారీగా ఖర్చు పెట్టారు. మే 23 ఉదయం 9.49 నిమిషాలకు చంద్రబాబు బెంగళూరులోని తాజ్‌ వెస్ట్‌ ఎండ్ హోటల్లో దిగారు.

మరుసటి రోజ ఉదయం 5. 44 నిమిషాలకు హోటల్‌ రూం ఖాళీ చేశారు. ఈ మాత్రం దానికే చంద్రబాబు చేసిన ఖర్చు 8 లక్షల 72వేల 485 రూపాయలు. ఇక ఏ నేత కూడా అంత బిల్లు చేయలేదు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ బిల్లు లక్షా రెండువేలు అయింది.

మాయవతి బిల్లు లక్షా 41వేలు, సీపీఎం నేత సీతారం ఏచూరీ ఖర్చు 64వేలు అయింది. ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ పేరున బిల్లు 64వేలుగా ఉంది. ఎంఐఎం అధినేత ఓవైసీ ఖర్చు 38వేల నాలుగు వందలుగా ఉంది. చంద్రబాబు తర్వాత అత్యధిక బిల్లు ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరున ఉంది. ఆయన ఒక రోజుకు లక్షా 85వేల రూపాయలు బిల్లు చేశారు.

ఒక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి బిల్లు మాత్రం ఏకంగా 8లక్షల 72వేలు ఉండడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ దుబారాపై కర్నాటక మాజీ లోకాయుక్తా సంతోష్ హెడ్డే మండిపడ్డారు. పార్టీ తరపున అతిథులను పిలిచి ప్రభుత్వ సొమ్మును ఎలా వాడుతారని ప్రశ్నించారు. ఈ సొమ్మును జేడీఎస్ తన పార్టీ ఖర్చు నుంచి చెల్లించాలని బీజేపీతో పాటు పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు దేశంలోనే లగ్జరీ సీఎం అని మరోసారి రుజువు చేసుకున్నట్టు అయింది.