Home ప్రత్యేకం ఇప్పుడు ఇలా కూడా ప్రచారం చేయొచ్చు…

ఇప్పుడు ఇలా కూడా ప్రచారం చేయొచ్చు…

291
SHARE

చంద్రబాబు అనుసరించి వ్యూహం తొలి నుంచి కూడా ఒకటే. ఏ పార్టీతో తనకు అవసరం లేదో.. ఏ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందో గుర్తించి.. ఆపార్టీతో తన ప్రత్యర్థులకు సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేయడమే సదరు వ్యూహం. ఈ వ్యూహంలో భాగంగానే బీజేపీతో పలుమార్లు పొత్తులు పెట్టుకుని.. అన్నేసార్లు చీత్కరించారు చంద్రబాబు. వాజపేయిపై ప్రజల్లో సానుకూలత ఉందన్నప్పుడు బీజేపీతో కలిశారు. అనంతరం బీజేపీ పని అయిపోయిందని తెలియగానే ఆ పార్టీతో పొత్తు చారిత్రిక తప్పిదమని.. బీజేపీ మసీసులు కూల్చే పార్టీ అని 2014 వరకు ప్రచారం చేశారు.

కానీ మొన్నటి ఎన్నికల సమయంలో మోడీ హవా విపరీతంగా ఉందని గుర్తించి వెంటనే తిరిగి బీజేపీకి జై కొట్టారు. ఇప్పుడు ఏపీలో బీజేపీపై ప్రజల్లో కోపం ఉందని గుర్తించి నాలుగేళ్ల తర్వాత ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చి ధర్మదీక్షలంటూ పోరాటం మొదలుపెట్టారు. అంతవరకు ఆగితే చంద్రబాబు ఎలా అవుతారు. మొన్నటి వరకు తనతో కలిసి కాపురం చేసిన బీజేపీకి, వైసీపీ మధ్య ఏదో సంబంధం ఉందని ప్రచారం మొదలుపెట్టారు. ఇందుకు టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న శ్రమ అంతా ఇంతకాదు.

వీలుచిక్కితే చాలు బీజేపీ- వైసీపీ మధ్య ఏదో ఉందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. కానీ బాబు వ్యూహాన్ని పసిగట్టిన వైసీపీ గట్టిగానే ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తుండడంతో టీడీపీ మీడియా కూడా బిక్కమొహం వేస్తోంది. సరిగ్గా నెల రోజుల క్రితం టీడీపీ అనుకూల పత్రిక ఒకటి .. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో వైసీపీ బీజేపీ అభ్యర్థికే ఓటేస్తుందని కథనం రాసుకొచ్చింది. కేసులకు భయపడి అయినా సరే బీజేపీకే వైసీపీ మద్దతు ఇస్తుందని.. అప్పుడు ఆ పార్టీ అసలు రంగు తేలిపోతుందని రంకెలేసింది.

కానీ ఈసారి కూడా వ్యవహారం బెడిసికొట్టింది. బీజేపీ అభ్యర్థిగాని… ఆపార్టీ బలపరిచే అభ్యర్థికి గానీ తాము ఓటేసే ప్రసక్తే లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేరుగా ప్రకటించేశారు. దీంతోకేసులకు భయపడి వైసీపీ.. బీజేపీకి మద్దతు ఇస్తోందంటూ టీడీపీ, దాని అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం మరోసారి తేలిపోయింది. అయితే ఇప్పటికైనా బీజేపీ వైసీపీ మధ్య ఏదో సంబంధం ఉందన్న ప్రచారాన్ని టీడీపీ మీడియా మానుకునే అవకాశమే లేదు. అలా చేస్తే అది మీడియా చరిత్రలో వింతఅవుతుంది.

అవసరమైతే బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వకపోవడం వెనుక మరో కోణం ఉందంటూ కొత్త కథను అల్లేయవచ్చు. పబ్లిక్‌గా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తే ఏపీ ప్రజలు వైసీపీకి ఓటేయరని.. అది చంద్రబాబుకు మంచి చేస్తుందని.. కాబట్టి డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తాము ఓటు వేయలేమని ఏమీ అనుకోవద్దని ముందే బీజేపీ పెద్దల వద్ద వైసీపీ అనుమతి తీసుకుందని కూడా టీడీపీ మీడియా ప్రచారం చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక వర్గం మీడియాకు వాస్తవాలతో అవసరం లేదు. బాబుగారు బాగుంటే చాలు.