Home రాజకీయాలు ఎస్వీ మోహన్‌ రెడ్డి.. ఒక గుదిబండ బాబోయ్‌…

ఎస్వీ మోహన్‌ రెడ్డి.. ఒక గుదిబండ బాబోయ్‌…

SHARE

కర్నూలు టీడీపీలో లోకేష్‌ రాజేసిన నిప్పు ఆరేలా లేదు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డే పోటీ చేస్తారని ఇటీవల లోకేష్ ప్రకటించడంతో టీజీ వెంకటేష్ వర్గం అప్రమత్తమైంది.వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు టీజీ భరత్‌ను బరిలో దింపాలని భావించిన టీజీ వెంకటేష్‌కు లోకేష్ ప్రకటన ఏమాత్రం రుచించలేదు. అసలు అభ్యర్థుల పేర్లు ప్రకటించడానికి లోకేష్ ఎవరని టీజీ మీడియా ముందే ప్రశ్నించారు.

ఫిరాయింపు ఎమ్మెల్యే మాత్రం లోకేషే ప్రకటించిన తర్వాత చంద్రబాబు కూడా అందుకు విరుద్దంగా వ్యవహరించరని టికెట్ తనదేనని ధీమాతో ఉన్నారు. ఈనేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు టీజీ భరత్ రెడీ అవుతున్నారు. టీడీపీ పేరు మీద కాకుండా వ్యక్తిగతంగా తన బలాన్ని పెంచుకునే పనిలో ఉన్నారు. బూత్‌ లెవన్ కార్యకర్తలతో నిత్యం టీజీ భరత్ భేటీ అవుతున్నారు. సర్వే ప్రకారమే టికెట్‌ కేటాయిస్తారని చెబుతూనే… ఒకవేళ అలాజరక్కపోయినా తాను పోటీ చేయడం ఖాయమని చెబుతున్నారు.

టీడీపీ టికెట్ గురించి ఆలోచించకుండా కేవలం తన వెంట నడవాలని శ్రేణులను కోరుతున్నారు. కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి చంద్రబాబునాయుడు పోటీ చేస్తే తనకు అభ్యంతరం లేదని.. అలా కానిపక్షంలో టికెట్ తనదేనని ఆదివారం టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ప్రకటన బట్టి చంద్రబాబు కాకుండా ఎవరూ పోటీ చేసినా తాను అంగీకరించబోనని భరత్ సూటిగానే చెప్పినట్టు అయింది.

ఆర్థికంగానూ బలంగా ఉన్న టీజీ భరత్‌ బూత్‌ లెవల్‌ కార్యకర్తలతో భేటీ అవుతూ.. టికెట్ గురించి ఆలోచించకుండా తన వెంట నడవాలని.. అందరికీ తాను అండగా ఉంటానని హామీ ఇస్తుండడంతో టీడీపీ ఆందోళన కలిగిస్తోంది. టీజీ భరత్ చర్యలను బట్టి చూస్తుంటే ఆయన సొంతంగా బలాన్ని పెంచుకుంటున్నారని .. టికెట్ ఇస్తే టీడీపీ నుంచి పోటీ చేయడం లేదంటే ఇండిపెండెంట్‌గానో .. లేక అవకాశం వస్తే వైసీపీలో చేరి అక్కడి నుంచి పోటీ చేయడమే చేయవచ్చని అబిప్రాయపడుతున్నారు.

ఆ ముందుచూపుతోనే పార్టీతో సంబంధం లేకుండా నియోజవకర్గంలో సొంతబలాన్ని పెంచుకుంటున్నారని చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించి ప్రజల చేత చీదరించుకుంటున్న ఎస్వీమోహన్ రెడ్డిని నమ్ముకుని బరిలో దిగితే ప్రతికూలఫలితమే ఉండవచ్చంటున్నారు. ఎస్వీమోహన్ రెడ్డికి పార్టీ సాయపడాల్సిందేగానీ.. పార్టీకి ఎస్వీమోహన్ రెడ్డి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద లోకేష్ చేసిన ముందస్తు ప్రకటన వల్ల టీజీ కుటుంబం అప్రమత్తమై ముందస్తు వ్యూహరచన చేసేందుకు వీలు కలిగిందని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.