Home రాజకీయాలు కాపాడే చౌదరి ఆయనేనా!

కాపాడే చౌదరి ఆయనేనా!

215
SHARE

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఏపీలో జరిగిన 53వేల కోట్ల రూపాయల అకౌంట్ల కుంభకోణంపై జీవీఎల్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా టీడీపీ నేత కుటుంబరావు స్పందించారు.

బీజేపీ సీబీఐ విచారణను డిమాండ్ చేయగా.. కుటుంబరావు మాత్రం కావాలంటే సెంట్రల్ విజిలెన్స్ చేత దర్యాప్తు చేయించాలన్నారు. ఇందుకు ప్రతిగా స్పందించిన జీవీఎల్ నర్సింహరావు… ఎవరో చౌదరి కాపాడుతారని టీడీపీ నేతలు అనుకుంటున్నారని.. కానీ ఈ కుంభకోణం విషయం ఇంతటితో ఆగబోదన్నారు.

లాలూప్రసాద్ యాదవ్‌ కూడా దానా కుంభకోణం సమయంలో ఇలాగే తొలుత ఎదురుదాడి చేశారన్నారు. అయితే ”ఎవరో చౌదరి కాపాడుతారని టీడీపీ నేతలు అనుకుంటున్నారని” జీవీఎల్ చేసిన వ్యాఖ్యల్లో ఆ చౌదరి ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది.

అయితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చేత విచారణ జరిపించాలని కుటుంబరావు అనడం… జీవీఎల్ ఎవరో చౌదరి వచ్చి కాపాడుతారని టీడీపీ నేతలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించడం బట్టి క్లూ దొరికినట్టేనంటున్నారు. ప్రస్తుతం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా ఆంద్రప్రదేశ్‌కే చెందిన కేవీ చౌదరి ఉన్నారు.

అందుకే కుటుంబరావు కూడా సీవీసీ విచారణకు అడిగినట్టు భావిస్తున్నారు. దీన్ని బట్టి ఎవరో చౌదరి వచ్చి తమను కాపాడుతారని టీడీపీ నేతలు అనుకుంటున్నారేమో అని జీవీఎల్ చెప్పిన ఆ చౌదరి కేవీ చౌదరే అయి ఉంటారని భావిస్తున్నారు.