Home సినిమా ‘గూఢచారి’ మూవీ రివ్యూ

‘గూఢచారి’ మూవీ రివ్యూ

SHARE

రేటింగ్ : 3/5
జానర్ : స్పై థ్రిల్లర్‌
తారాగణం : అడివి శేష్‌, శోభితా దూళిపాల, ప్రకాష్‌ రాజ్‌, జగపతి బాబు, సుప్రియా యార్లగడ్డ, వెన్నెల కిశోర్‌
సంగీతం : శ్రీచరణ్‌ పాకల
దర్శకత్వం : శశి కిరణ్ తిక్క
నిర్మాత : అభిషేక్‌ నామా, అనిల్ సుంకర, విశ్వప్రసాద్‌

క్షణం సినిమాతో నటుడిగానే కాక రచయితగా కూడా సూపర్ హిట్ అందుకున్న అడివి శేష్ మరోసారి తన కథా కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి హాలీవుడ్ బాండ్ సినిమాలను తలపించే గూఢచారి కథతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తానే లీడ్‌ రోల్‌లో నటించిన ఈ సినిమాను అభిషేక్‌ పిక్చర్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మించాయి. శశి కిరణ్ తిక్క దర్శకుడు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది.? రచయితగా అడివి శేష్‌ మరోసారి విజయం సాధించాడా..?

కథ
భారతదేశ రక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రినేత్ర సంస్థ కోసం పాల్గొన్న ఒక ఆపరేషన్ లో గోపి(అడవి శేష్) తండ్రి రఘువీర్ చనిపోతాడు. శత్రువుకు ఉనికి తెలియకుండా ఉండటం కోసం త్రినేత్రలోనే పనిచేసిన అతని మావయ్య సత్య(ప్రకాష్ రాజ్) గోపిని ఢిల్లీకి తీసుకెళ్లిపోతాడు. అక్కడ మేనల్లుడి పేరుని  అర్జున్ గా మార్చేస్తాడు. రాలో చేరాలన్న తన లక్ష్యం త్రినేత్ర హెడ్ దామోదర్(అనీష్ కురువిల్లా) సహాయంతో నెరవేర్చుకుంటాడు అర్జున్. అక్కడ కాంబాట్ ట్రైనింగ్ హెడ్ నదియా ఖురేషి(సుప్రియ)ఆధ్వర్యంలో లీనా(మధుశాలిని)తో పాటు మరో నలుగురితో కలిసి శిక్షణ తీసుకుంటాడు.ఆ క్రమంలోనే తన పక్క ప్లాట్ లో ఉండే సైకియాట్రీస్ట్ సమీరా(శోభిత ధూళిపాళ) ప్రేమలో పడతాడు. అనూహ్యంగా జరిగిన సంఘటనల వల్ల చారి, దామోదర్ హత్యకు గురైతే ఆ అభియోగం అర్జున్ మీద పడుతుంది. దీంతో అర్జున్ అక్కడి నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. దీని వెనుక ఉన్న రానా(జగపతిబాబు) కోసం వేట మొదలుపెడతాడు. తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. మరి గూఢచారి ఈ పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే స్టోరీ.

నటీనటులు
బాండ్‌ తరహా కథ కావటంతో సినిమా అంతా అడివి శేష్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇండియన్‌ బాండ్‌లా అడవి శేష్‌ యాక్షన్, రొమాన్స్‌, కామెడీ, ఎమోషన్స్‌ ఇలా అన్ని వేరియేషన్స్‌ను చాలా బాగా పలికించాడు. సినిమాలో జగపతి బాబు ఎంట్రీ ఆడియన్స్‌ కు షాక్‌ ఇస్తుంది. మరోసారి ప్రతినాయక పాత్రలో జగపతి బాబు మెప్పించాడు. కరుడుగట్టిన తీవ్రవాదిగా ఆయన నటన, లుక్స్‌ సినిమాకు ప్లస్‌ అయ్యాయి. అక్కినేని వారసురాలు సుప్రియ రీ ఎంట్రీకి పర్ఫెక్ట్ క్యారెక్టర్‌ను ఎంచుకున్నారు. త్రినేత్ర టీం ఆఫీసర్‌ పాత్రలో ఆమె నటన సూపర్బ్‌. నెగెటివ్‌ షేడ్స్‌ ను కూడా చాలా బాగా చూపించారు. తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం అయిన శోభితా దూళిపాలకు మంచి పాత్ర దక్కింది. ఆమె.. గ్లామర్‌ షోతో పాటు నటిగానూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరో కీలక పాత్రలో వెన్నెల కిశోర్ ఆకట్టుకున్నాడు. తాను సీరియస్‌గా ఉంటూనే కామెడీ పండించాడు. ఇతర పాత్రల్లో ప్రకాష్‌ రాజ్‌, మధుశాలిని, అనీష్ కురివిల్లా తదితరులు తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు.

ప్లస్‌ పాయింట్స్‌
కథా కథనం
లీడ్‌ యాక్టర్స్ నటన
సినిమాటోగ్రఫి
నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌
లవ్ సీన్స్‌

విశ్లేషణ
ఈ జనరేషన్‌కు బాండ్ తరహా చిత్రాలు పెద్దగా పరిచయం లేదనే చెప్పాలి. ఎన్నో చిక్కుముడులతో తయారు చేసుకున్న బాండ్‌ కథను ఏమాత్రం కన్ఫ్యూజన్‌ లేకుండా వెండితెర మీద ఆవిష్కరించటంలో దర్శకుడు శశి కిరణ్ విజయం సాధించాడు. ముఖ్యంగా సినిమాలో ప్రతీ పాత్ర ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చేలా ప్లాన్ చేసిన స్క్రీన్‌ప్లే సినిమాకు హాలీవుడ్ స్థాయిని తీసుకువచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే రొమాంటిక్ సీన్స్‌ కాస్త బోరింగ్ గా అనిపించినా.. సెకండ్‌ హాఫ్‌లో ఆ సీన్స్‌కు ఉన్న కనెక్షన్‌ చూసిన తరువాత లవ్‌ సీన్స్‌ కూడా ఓకె అనిపిస్తాయి. అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ ఎలా నిర్వహిస్తారు, వారి సెలక్షన్‌ ఎలా జరుగుతుంది, ఎలా ట్రైన్‌ చేస్తారు లాంటి అంశాలు ఆసక్తికరంగా తెరకెక్కించారు. సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్స్‌ సినిమాటోగ్రఫి, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌. ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌కు కావాల్సిన ఇంటెన్సిటీని తీసుకురావటంలో కెమెరామెన్‌ శానెల్‌ డియో, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకల విజయం సాధించారు. అబ్బూరి రవి రాసిన మాటలు బుల్లెట్లలా పేలాయి. ఎడిటింగ్, ఆర్ట్‌ ఇలా అన్నీ కలిసి సినిమాను విజయం వైపు నడిపించాయి. నిర్మాణ విలువలు సినిమాకు మరో ఎసెట్‌.