Home రాజకీయాలు ‘ప్రత్యేక హోదా’.. ఏపీకి జీవన్మరణ సమస్యే

‘ప్రత్యేక హోదా’.. ఏపీకి జీవన్మరణ సమస్యే

92
SHARE

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య అని రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి గళమెత్తారు. ఏపీకి సంజీవని అయిన హోదా విషయంలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌ ప్రజలను దారుణంగా మోసం చేశాయని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ అంశం ప్రజాకోర్టులో ఉందని.. హోదా విషయంలో మోసం చేసిన పార్టీ లకు రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. విభజన జరిగినప్పుటి నుంచి వైఎస్సార్‌సీపీ మాత్రమే హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తోందని గుర్తుచేశారు. హోదా ఏపీకి సంజీవని అన్న విషయాన్ని వైఎస్సార్‌సీపీ బలంగా విశ్వసించిందని, ఏపీ సీఎం చంద్రబాబు హోదా ఏమైనా సంజీవనా? అంటూ ఎగతాళి చేశారని విమర్శించారు.

రాజ్యసభలో మంగళవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో తమకు తగినంత సమయం కేటాయించలేదని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. అంతకు ముందు కొద్ది సేపు పోడియంలో ఉప రాస్ట్రపతి వెంకయ్య నాయుడుతో వాదనకు దిగారు. తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం వారికి ఇరవై ఏడు నిమిషాలు ఇచ్చారని, తమకు పదిహేను నిమిషాలు అయినా ఇవ్వాలని కోరారు. అందుకు వెంకయ్య నాయుడు ఒప్పుకోలేదు. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ ప్రసంగానికి ముందు విజయసాయిరెడ్డి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాని అందుకు వెంకయ్య ఒప్పుకోలేదు. దాంతో ఆయన పోడియంలోకి వెళ్లి నిరసన తెలిపారు. దానిపై వెంకయ్య స్పందిస్తూ తాను సంఖ్యాబలం బట్టి అవకాశం ఇచ్చానని, వేమిరెడ్డి ప్రబాకరరెడ్డికి ఒక నిమిషం మాట్లాడాలని కోరితే ఆయన అంగీకరించలేదని అన్నారు. తనను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే సిద్దంగా లేనని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. దాంతో విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సభ నుంచి వాకౌట్‌ చేశారు.