Home సినిమా ఎన్ని ముద్దుల‌ని కాదు.. ఎంత సేపు అని ఆలోచిస్తారు!

ఎన్ని ముద్దుల‌ని కాదు.. ఎంత సేపు అని ఆలోచిస్తారు!

SHARE

కార్తికేయ‌, పాయ‌ల్ రాజపుత్ హీరో హీరోయిన్లుగా కె.సి.డ‌బ్ల్యు బ్యాన‌ర్‌పై అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మించిన చిత్రం ‘ఆర్ ఎక్స్ 100’. జూలై 12న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సంద‌ర్భంగా హీరో కార్తికేయ హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడుతూ సినిమా సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను చెప్పాడు.

ఆర్ ఎక్స్ 100 రైడ్ ఎలా సాగింది?
– ఆ బండిమీద ప్ర‌యాణంలాగానే సాగింది. చాలా సౌండ్‌తో… రోడ్ కూడా బాగా లేదు. సో రోల‌ర్ కోస్ట‌ర్ రైడ్ లాగా అయింది. ఇట్ వాజ్ రియ‌లీ ఎగ్జ‌యిటింగ్‌.. అదంతా ఎంజాయ్ చేస్తున్నా.

ఇన్‌క్రెడిబుల్ ల‌వ్ స్టోరీ అంటే ఏంటి?
-ల‌వ్ స్టోరీ అన‌గానే బోయ్‌, గ‌ర్ల్ స్టార్ట్ అవుతుంది. కాలేజీ అయిన త‌ర్వాత ఎక్క‌డో కాఫీ షాప్‌లో ల‌వ్ మొద‌ల‌వుతుంద‌నే ధోర‌ణి అల‌వాటైంది. మేం అలా కాకుండా ల‌వ్ స్టోరీ అంటే ఏంటి? ప్రేమ‌కి ఎలాంటి స‌మ‌స్య‌లు రావొచ్చు… వంటివ‌న్నీ ఇంటెన్స్ గా చేశాం. దాన్ని జ‌స్టిఫై చేయ‌డానికి ఇన్ క్రెడిబుల్ అని పెట్టాం. అంతేగానీ ఇంకేమీ కాదు.

ప్ర‌తీకార నేప‌థ్యంలో సాగుతుందా సినిమా?
– ప్ర‌తికార నేప‌థ్యం ఏమీ ఉండ‌దండీ. రివెంజ్ ఉండ‌దు. ట్రైల‌ర్ చూసి అలా ఉంటుంద‌నుకుంటున్నారేమో. ఒక మండ‌ల్ హెడ్ క్వార్ట‌ర్‌లాంటి ప్లేస్‌లో జ‌రిగే సినిమా ఇది.

సినిమాలో ఎన్ని ముద్దులు పెట్టారు?
– లెక్క‌పెట్టుకోలేదండీ.. ఎన్ని పెట్టుకున్నామో, ఎన్ని ఎడిట్ చేశారో, ఎన్ని ఉన్నాయో తెలియ‌దు. కాక‌పోతే ఒక‌టి చెప్ప‌గ‌ల‌ను.. ఎన్ని అని చెప్ప‌లేను కానీ, ఎంత సేపు అన్న‌ట్టు మాత్రం ఉంటుంది. అది ప్రేక్ష‌కులు కూడా లెక్క‌పెట్ట‌రు. ఫ్లోలో చూసుకుంటూ వెళ్తారంతే.

సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ ఏంటి?
– కాన్ఫిడెన్స్ ఏంటంటే సార్‌.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఈ మ‌ధ్య ప్ర‌యోగాలు వ‌స్తున్నాయి. అయినా ఇంకా ఫార్ములాలోనే ఉంటున్నాయి. హీరో అంటే ఇలా ఉండాలి. విల‌న్ అంటే చెడ్డ‌వాడై ఉండాలి. హీరోయిన్ అంటే ప‌ద్ధ‌తిగా ఉండాలి… అనే వాటిని పెట్టుకుని, వాటిలో ఎక్స్ పెరిమెంట్ చేస్తున్నారు. అయితే ప్రేమ‌లో ఎలాగైనా జ‌ర‌గ‌వ‌చ్చు. ప్రేమ‌లో ఉన్న వారు ఎలా బిహేవ్ చేస్తారు వంటి విష‌యాల‌ను ఎక్స్ పెరిమెంట్‌లో ఈ లెవ‌ల్ మాత్రం ఇప్ప‌టిదాకా ఎవ‌రూ చూపించ‌లేదు. ఇలాంటిది ఒప్పుకోవాలంటే ప్రేక్ష‌కులు కూడా దానికి సిద్ధంగా ఉండాలి. అలా కాకుండా, ఏదో కాసేపు కూర్చుని వెళ్దామ‌నుకునేవారికి సినిమా సెట్ కాదు.

అర్జున్ రెడ్డి త‌ర‌హా సినిమానా?
– అది కూడా అలా ఉండ‌దు. అది డిఫ‌రెంట్ జోన‌ర్‌. అది కూడా ల‌వ్ స్టోరీనే. అందులోనూ ఎక్స్ పెరిమెంట్స్ చేశారు. అందులో హీరో పాత్ర మొత్తం యారొగెంట్‌గా ఉంటుంది. కానీ మా సినిమాలో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో హీరో చాలా అమాయ‌కంగా ఉంటాడు. ముద్దొస్తుంటాడు. హీరోయినే వాడిని డామినేట్ చేస్తుంటుంది. హీరోయినే స్టెప్ ఫార్వ‌ర్డ్ వేస్తుంటుంది. ఇలాంటి స్టేజ్ నుంచి ఎక్స్ ట్రీమ్ సైకోనెస్‌కి ఎలా వెళ్లాడ‌న్న‌దే క‌థ‌. ఇంత వేరియేష‌న్ నా జీవితంలో లేదు. సినిమాల్లో జ‌న‌ర‌ల్‌గా చూపించేవి నిజ జీవితంలో ఉండ‌వు. ఇలాంటి ప్రేమ‌క‌థ‌లే నిజ జీవితంలో నిజంగా ఉంటాయి.

సైకోలా మారిపోయి, విల‌న్‌గా బిహేవ్ చేస్తే అమ్మాయిలు యాక్సెప్ట్ చేస్తార‌నుకుంటారా?
– చేస్తార‌ని నేను చెప్ప‌డం లేదే. అందులోనూ ఓ లిమిట్ ఉంటుంది. ప్రేమ చూపిస్తున్నాడా? టార్చ‌ర్ చేస్తున్నాడా అనేది ఉంటుంది.

ఇందులో ప్రేమా? టార్చ‌రా?
– సినిమాను చూసే క‌ళ్ల‌ను బ‌ట్టి ఉంటుంది.

మీ పాత్ర ఎలా ఉంటుంది?
– ఒక కేర‌క్ట‌రైజేష‌న్ అనేది ఉండ‌దు. ఒక ఊర్లో తండ్రితో ఉండే డీసెంట్ కుర్రాడు. ఒక‌మ్మాయి వాడి జీవితంలోకి వ‌చ్చాక‌, వాడి జీవితం ఏమైంది? ఎలాంటి మార్పులు వ‌చ్చాయి? అనేది ఆస‌క్తిక‌రం. మ‌న‌లో అంద‌రికీ ఒక కేర‌క్ట‌ర్ అనేది ఏమీ ఉండ‌దు. సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టు బిహేవ్ చేస్తుంటాం. అలాంటి నార్మ‌ల్ మ‌నిషుల‌కు అతీతంగా బిహేవ్ చేసే వ్య‌క్తి క‌థ ఇది.

మీ బ్యాక్‌గ్రౌండ్ చెప్పండి?
– నాది హైద‌రాబాద్‌. ఇక్క‌డే పుట్టి పెరిగాను. వ‌న‌స్థ‌లిపురంలో మా ఇల్లు. వ‌న‌స్థ‌లిపురంలో డాడీకి స్కూల్ ఉంది. నో క‌నెక్ష‌న్ టు మూవీస్ అండ్ ఆల్‌. కాక‌పోతే చిన్న‌ప్ప‌టి నుంచీ నాకు మూవీస్ ఇంట్ర‌స్ట్. ఇంట్లో స్కూల్ బ్యాక్‌డ్రాప్ ఉంది కాబ‌ట్టి చ‌దివాను.వ‌రంగ‌ల్ నిట్‌లో ఇంజినీరింగ్ చేశా. ముందు నుంచే నాకు సినిమాల‌మీద ఆస‌క్తి ఉన్న‌ది. అందుకని ఫిజిక్ మీద దృష్టి పెట్టా. డ్యాన్సులు బాగా నేర్చుకున్నా. కాలేజీ అయిపోయాక యాక్టింగ్ కోర్సులు చేశా. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశా. కొన్ని సినిమాలు చేశా. అవి రిలీజ్ కాలేదు. గ‌తేడాది ఓ సినిమా విడుద‌లైంది. కానీ అది ఎక్కువ తెలియ‌లేదు. సో ఇంక ఫైన‌లీ చేస్తా చేస్తా ఈ సినిమా చేశా.

సినిమా చాలా వ‌ర‌కు `రా`గా ఉండేట‌ట్టుంది. ఎలా చేశారు? ఎలా మౌల్డ్ అయ్యారు?
– మేం ఈ సినిమాను రెండు షెడ్యూళ్ల‌లో చేశాం. గ‌డ్డం గెట‌ప్‌తో, ఇంటెన్స్ తో చేసేదంతా ఓ షెడ్యూల్‌. అదేమీ లేకుండా అమాయ‌కంగా ఉండేది ఇంకో షెడ్యూల్‌లో చేశాం. ఆ షెడ్యూల్స్ కి మ‌ధ్య రెండు నెల‌లు గ్యాప్ వ‌చ్చింది. ముందు అమాయ‌కుడిగా చేసి, త‌ర్వాత ఇంటెన్స్ సీన్స్ చేశా. డైర‌క్ట‌ర్‌గారితో రెగ్యుల‌ర్‌గా వ‌ర్క్ షాప్స్ చేశాం. చాలా బాధ్య‌త‌తో కూడిన రోల్ అని నాకు తెలుసు. ఈ పాత్ర ఎవ‌రంటే వాళ్లు చేసేది కాదు. రావుర‌మేశ్‌గారు, రామ్‌కీగారికి ఈజీగానే ఉంటుంది. హీరోయిన్ కూడా పంజాబీ సినిమాల్లో అవార్డు విన్న‌ర్‌. అలాంటి వాళ్ల మ‌ధ్య సినిమా చేస్తున్న‌ప్పుడు ఎంత బాధ్య‌త‌గా ఉండాలో నాకు అర్ధ‌మైంది. ఈ సినిమాకు ఫేస్ నేనే అవుతున్న‌ప్పుడు ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలో తెలుసుకుని సంపూర్ణంగా కృషి చేశా. త‌ర్వాత ఎలా ఉంద‌నేది ఆడియ‌న్స్ చెప్పాలి.