Home రాజకీయాలు స్వామి పరిపూర్ణానంద రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారా?

స్వామి పరిపూర్ణానంద రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారా?

287
SHARE

సైనికుడు సరిహద్దుల వద్ద చేసేది దేశ రక్షణ అని, స్వాములు చేస్తున్నది ధర్మ రక్షణ అని శ్రీ పీఠం అధిపతి, రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి పరిపూర్ణానంద అన్నారు. హిందూ మతం పై జరుగుతున్నదాడికి నిరసనగా ‘ధర్మాగ్రహ యాత్ర’ పేరిట మూడు రోజుల యాత్రని రేపటి నుంచి ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో ఓ ప్రముఖ తెలుగు న్యూస్‌ ఛానెల్‌ తో మాట్లాడుతూ పరిపూర్ణానంద స్వామి వారు….అగ్ర వర్ణాలు, నిమ్న జాతి వర్ణాలు అంటూ వర్గ చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారన్నారు.

రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా అన్న ప్రశ్నకు స్వామి సమాధానం చెబుతూ… ఈ రోజు వరకూ రాజకీయ నాయకులు ధర్మాన్ని నిలబెట్టే మంచి పనులు చేస్తే ఆ కార్యక్రమాలకు వెళ్లి వారి గురించి నాలుగు మాటలు మాట్లాడుతున్నానని అన్నారు. సమాజానికి మన అవసరం ఉందని, మన వల్ల మంచి జరుగుతుందని అనిపిస్తే రాజకీయాల్లోకి వెళ్లే వాతావరణ౦ దానంతట అదే వస్తుందని అన్నారు. తన వల్ల మంచి జరుగుతుందని, అవసరం ఉందని భగవంతుడు భావించి తనను రాజకీయాల వైపు పంపితే వస్తానని స్వామి అన్నారు.

ధర్మాగ్రహ యాత్రలో భాగంగా హిందువులంతా ఒక్కటవుతారని, తమ లక్ష్యం ఓ వ్యక్తి కాదని, రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయటానికి దారి తీస్తున్న దుర్మార్గపు ఆలోచనల పైనే ఈ యుద్ధమని స్వామి పరిపూర్ణానంద అన్నారు.

మతాలను కించ పరిచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పాకిస్థాన్‌ నుంచి ఎవరైనా చొరబడితే మన సైనికుడు తుపాకీతో వారిని తరిమికొట్టి దేశ రక్షణ చేస్తారని, అదెలా తప్పు అని అంటూ అలానే హిందూ ధర్మరక్షణ కోసం తాము పోరాడడం తప్పు ఎలా అవుతుందని అన్నారు.

ఆంధ్ర కి స్వామి పరిపూర్ణానంద యోగి ఆదిత్యనాథ్ లా అవుతారో లేదో కాలమే చెప్పాలి