Home సినిమా ‘తేజ్‌ ఐ లవ్‌ యు’ మూవీ రివ్యూ

‘తేజ్‌ ఐ లవ్‌ యు’ మూవీ రివ్యూ

SHARE

టైటిల్ : తేజ్‌ ఐ లవ్‌ యు
జానర్ : రొమాంటిక్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : సాయి ధరమ్‌ తేజ్‌, అనుపమా పరమేశ్వరన్‌, జయ ప్రకాష్‌, పవిత్రా లోకేష్‌, అనీష్‌ కురివిల్లా
ఛాయాగ్రహణం : ఐ. ఆండ్రూ
నిర్మాతలు : కె.ఎస్‌. రామారావు, వల్లభ
కథ, కథనం, దర్శకత్వం : ఏ. కరుణాకరన్‌
రేటింగ్‌: 2.25/5

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్‌ తేజ్‌ తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సాధించుకునేందుకు కష్టపడుతున్నాడు. కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస విజయాలు అందుకున్నా.. తరువాత కెరీర్ గాడి తప్పింది. మాస్‌ హీరోయిజం కోసం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో.. ఈ సారి తేజ్‌ ఐ లవ్‌ యు అంటూ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిప్రేమ, డార్లింగ్‌ లాంటి లవ్‌ స్టోరిలను తెరకెక్కించిన కరుణాకరన్‌ దర్శకత్వంలో లవర్‌బాయ్‌గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కరుణాకరన్‌ కెరీర్‌కు కూడా ఈ సినిమా కీలకం కావటంతో రిజల్ట్ మీద ఆసక్తి నెలకొంది. మరి తేజ్ ఐ లవ్ యు ఈ ఇద్దరి కెరీర్‌లకు బ్రేక్‌ ఇచ్చిందా..?

కథ :

తేజ్ (సాయి ధరమ్ తేజ్ ) పెద‌నాన్న(జ‌య‌ప్ర‌కాష్‌) ఇంట్లో ఉంటాడు..ఓ రోజు తన చెల్లెలు ఓ వ్యక్తిని ప్రేమించిన విషయాన్నీ తేజ్ తెలుసుకుంటాడు.. ఆ తర్వాత తన చెల్లెలి ప్రేమలో నిజాయితీ ఉందని ఆ విషయాన్నీ కుటుంబ సబ్యులకు చెపుతాడు. కానీ వారు మాత్రం ఈ పెళ్లి కి నిరాకరిస్తారు. అయినాగానీ తేజ్ తన చెల్లెలు ప్రేమించిన అతడితో పెళ్లి చేస్తాడు. దీంతో పెద‌నాన్న , తేజ్ ను ఇంటినుండి బయటకు పంపేస్తాడు. దాంతో హైద‌రాబాద్‌లోని బాబాయ్ (పృథ్వి) ఇంట్లో ఉంటూ, కాలేజీలో కొంత మంది స్నేహితుల‌తో క‌లిసి ఓ రాక్ బ్యాండ్‌ని ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ చేస్తుంటాడు.

ఓ రోజు నందిని (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్‌) తో తేజ్ కు పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. అయితే అనుకోకుండా ఓ అగ్రిమెంట్ కార‌ణంగా 15 రోజులు ఆమెకు అత‌ను బాయ్ ఫ్రెండ్‌గా న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు. అగ్రిమెంట్ కారణంగా వీరిద్దరూ ప్రేమికులుగా నటించాల్సి వస్తుంది. ఈ క్రమంలో తేజ్ కు నందిని ఫై నిజమైన ప్రేమ పుడుతుంది. ఈ విషయాన్నీ ఆమెకు చెపితే ఏమంటుందొ అనే సందేహం లో ఉంటాడు. ఈ లోపు నందినికి యాక్సిడెంట్ ఆయె, గతం మరచిపోంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? తేజ్ , నందినికి గతం గుర్తు తెచ్చేందుకు ఏం చేసాడు..? తేజ్ తన ప్రేమను నందికి చెప్పాడా..లేదా..? అసలు నందినికి ఎలా యాక్సిడెంట్ అవుతుంది..? నందిని ని ఎవరు చంపాలనుకుంటారు..? అనేది మీరు తెరపై చూడాల్సిందే.

నటీనటులు :
ఇన్నాళ్లు మాస్‌ యాక్షన్ హీరో రోల్స్‌ లో మెప్పించిన సాయి ధరమ్‌ తేజ్‌ తొలిసారిగా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటించాడు. తనదైన ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌, కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. నటన పరంగా ఆకట్టుకున్నా లుక్స్‌ పరంగా ఇంకాస్త వర్క్ అవుట్‌ చేస్తే బాగుండేది. తెర మీద తేజ్‌ చాలా బొద్దుగా కనిపించాడు. అంతేకాదు గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాల్లో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లను ఇమిట్‌ చేసే ప్రయత్నం చేశాడు. హీరోయిన్‌ నందిని పాత్రలో అనుపమా పరమేశ్వరణ్ ఒదిగిపోయింది. తనకున్న హోమ్లీ ఇమేజ్‌ను పక్కన పెట్టి మోడ్రన్‌ లుక్‌లోనూ అదరగొట్టింది. జయప్రకాష్, పవిత్రా లోకేష్‌ల నటన కంటతడిపెట్టిస్తుంది. 30 ఇయర్స్‌ పృథ్వీ, వైవా హర్షలు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు.

ప్లస్‌ పాయింట్స్‌ :
ఫ్యామిలీ ఎమోషన్స్‌
కొన్ని కామెడీ సీన్స్‌
హీరోయిన్‌ పాత్ర

మైనస్‌ పాయింట్స్‌ :
సంగీతం
స్క్రీన్‌ ప్లే

విశ్లేషణ :
తొలిప్రేమ, డార్లింగ్‌ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న కరుణాకరన్ ఇటీవల ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోతున్నాడు. అందుకే కాస్త గ్యాప్‌ తీసుకొని ఓ ఫ్యామిలీ, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే మరోసారి కరుణాకరన్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. తన హిట్‌ చిత్రాల స్థాయిలో ఎమోషన్స్‌ను పండించలేకపోయాడు. చాలా చోట్ల కరుణాకరన్‌ గత చిత్రాల ఛాయలు కనిపించటం కూడా ఇబ్బంది పెడుతుంది. కథా పరంగా బలమైన ఎమోషన్స్ చూపించే అవకాశం ఉన్నా.. సాదాసీదా కథనంతో నడిపించేశాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ మొత్తంలో ప్రేక్షకుడ్ని కథలో లీనం చేసే స్థాయి ఎమోషనల్‌ సీన్‌ ఒక్కటి కూడా లేకపోవటం నిరాశపరుస్తుంది. అక్కడక్కడా కామెడీ వర్క్‌ అవుట్ అయినా.. సినిమాను నిలబెట్టే స్థాయిలో మాత్రం లేదు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు సంగీతం చాలా ఇంపార్టెంట్‌. కానీ మ్యూజిక్‌ డైరెక్టర్ గోపిసుందర్ పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ నిరాశపరిచాడు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ ప్లాపుల లిస్ట్ లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. రొటీన్ కథ, ఆకట్టుకోలేకపోయిన కామెడీ, అర్ధం పర్థం లేని సన్నివేశాలతో సినిమా ఫీల్ పోయింది. తేజ్ ప్రేమను పంచలేకపోయాడు.