Home రాజకీయాలు అఖిలప్రియ హాస్యం మామూలుగా లేదుగా!

అఖిలప్రియ హాస్యం మామూలుగా లేదుగా!

SHARE

పరిస్థితుల ప్రభావమో.. లేక ఏదొకటి మాట్లాడాలనే తాపత్రయమో తెలియదు కానీ.. గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు మాట్లాడే మాటలు ఏమాత్రం పొంతన లేకుండా సాగిపోతున్నాయి. కనీసం జనాలు నవ్వుతారేమో అన్న ఆలోచన కూడా చేయకుండా.. తమ గతం తామే మరిచి మరీ పొలిటికల్ డైలాగులు పేల్చేస్తున్నారు. ఈ క్రమంలో తాను మాత్రం తక్కువ తిన్నాన అని అనుకున్నారో ఏమో కానీ… తాజాగా ఏపీ మంత్రి అఖిలప్రియ తన విజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. ఇంతకూ ఆ విషయం ఏమిటంటారా… ఇదంతా ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలు, 2014లో టీడీపీ వైభవం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాత్ర గురించి!

అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు ఏర్పడి.. కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించిన నాలుగేళ్ల వరకూ గుర్తుకు రాని కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయం.. ఎన్నికలు దగ్గరయ్యే సరికి హఠాత్తుగా గుర్తుకొచ్చేసింది టీడీపీ నేతలకు. ఇంతకాలం కేవలం ఎంపీలుగానే ఉన్నారా అంటే… కాదాయే! కేంద్ర కేబినెట్ లో మంత్రులు! అయినా కూడా టీడీపీకి ఇటీవలే కడప ఉక్కు గుర్తుకు వచ్చింది. దీంతో.. హుటాహుటిన క్రెడిట్ గేం లో భాగమో లేక ఇంతకాలం చేసిన దగా గురించి ప్రజలు నిలదీస్తారనే భయమో కానీ… ఆ పార్టీ ఎంపీ సీఎం రమేశ్ దీక్షకు దిగారు. ఈ వేదికపై టీడీపీ నాయకులు మైకులు పట్టుకుని, గతం మరిచి తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ మంత్రి అఖిలప్రియ సీఎం రమేశ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి.. పవన్ పై స్పందించారు!

ఈ సందర్భంగా మైకందుకున్న అఖిల ప్రియ… జనసేన అధ్యక్షుడు కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడానికే ఉన్నారు తప్ప.. ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని అన్నారు. సరే అంతవరకూ బాగానే ఉంది అనుకుందాం కాసేపు.. అనంతరం.. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో కలిసి పోటీ చేయడం వల్ల “తాము” నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ.. పొత్తు లేకపోతే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవని చెప్పుకొచ్చారు! ఇక్కడే అఖిల ప్రియ విజ్ఞాన ప్రదర్శనపై సెటైర్స్ పడుతున్నాయి.

కాసేపు వాస్తవాలు మాట్లాడుకుంటే… గత ఎన్నికల్లో పవన్ ను ఇంటికెళ్లి మరీ కలిసి, బతిమాలి ఆయన మద్దతును కోరింది.. సాక్ష్యాత్తు చంద్రబాబు నాయుడు, ఆయన పుత్రరత్నం! ఆ విషయం మరిచిన అఖిల ప్రియ… పవన్ తమతో కలవడం, తమకు అడగకుండానే మద్దతిచ్చాడని ఇప్పుడు నిందలు వేయడం టీడీపీ నేతలకే చెల్లిందని పలువురు అంటున్నారు. ఇదే క్రమంలో… “తమకు” సీట్లు నష్టం జరిగిందని అఖిలప్రియ అంటుండటం మరింత చిత్రం. ఎందుకంటే.. పవన్ – టీడీపీ కలిసి పోటీ చేసే సమయంలో అఖిలప్రియ టీడీపీలో లేరు.. అప్పుడు ఆమె పార్టీ వైకాపా! అలాంటి నేపథ్యంలో అఖిలప్రియ మాటలు హాస్యాస్పదం కాక మరేమిటి?