Home రాజకీయాలు అవన్నీ బాబుకు ఉపాధిహామీ పథకాలేనట!

అవన్నీ బాబుకు ఉపాధిహామీ పథకాలేనట!

SHARE

సంవత్సరం పొడవునా ఉపాధిలేని కూలీలకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ఏర్పాటుచేస్తే… ఏపీలో జరుగుతున్న ప్రతీ ప్రాజెక్టూ కూడా చంద్రబాబు నాయుడికి ఉపాధి హామీ పథకంలా మారిపోయిందని ఫైరవుతున్నారు ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు! విమర్శలందు సోము వీర్రాజు విమర్శలు వేరయా అన్నట్లుగా.. చంద్రబాబు పేరిచెబితే చాలు నిప్పుల వర్షాలు కురిపించేస్తుంటారు విర్రాజు. తాజాగా పోలవరం ప్రాజెక్టు సందర్శించిన బీజేపీ నేతలు.. ఒక్కొక్కరుగా బాబుపై విమర్శల వర్షాలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోము వీర్రాజు కూడా పోలవరం పేరు చెప్పి బాబుపై విమర్శలు గుప్పించారు.

తాజాగా పోలవరం ప్రాజెక్టు సందర్శన అనంతరం మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు సోము వీర్రాజు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు ఇవ్వడంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తుందని, కావాలని పోలవరం ప్రాజెక్టును కేంద్రం అడ్డుకుంటుందన్న రేంజ్ లో చంద్రబాబు చేస్తున్న ప్రచారంపై సోము ఫైరయ్యారు. ఈ క్రమంలో.. రోజు రోజుకీ మారిపోతున్న ప్రాజెక్టు అంచనాలు హాట్ టాపిక్ గా మారిన తరుణంలో.. ఇదే విషయంపై సోము.. బాబును నిలదీశారు. అంచనాలకు అందనిరీతిలో పోలవరం ప్రాజెక్టు ద్వారా అవినీతి బాగోతం జరుగుతోందని.. పోలవరం ప్రాజెక్టు విషయంలో రోజుకోసారి లెక్కలు మారుతున్నది ఎందుకో బాబు చెప్పాలని సోము ప్రశ్నిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.16వేల కోట్ల నుంచి అమాంతం రూ.53000 కోట్లకు పెరిగిపోవడానికి గల కారణాలు బాబు చెప్పి తీరాలని ప్రశ్నించిన సోము వీర్రాజు…ఏపీలో జరిగే ఏ ప్రాజెక్టు అయినా చంద్రబాబుకు మాత్రం ఉపాధిహామీ పథకంగా మారుతుందని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికే అవినీతిలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉందని రకరకాల రిపోర్టులు వెలుగులోకి వస్తున్న తరుణంలో.. దీనికంతటికీ చంద్రబబే కారణమని.. ఆయన దోపిడీకి గునపాలు ఏమాత్రం చాలవని, ఏకంగా పెద్ద పెద్ద ప్రొక్లెయినర్లు కావాలి అని సెటైర్స్ వేస్తున్నారు సోము వీర్రాజు. ప్రస్తుతం ఏపీలో, చంద్రబాబు పాలనలో జరుగుతున్న దోపిడీని చూస్తుంటే… చంద్రబాబుకు ఏకంగా ఆస్కార్‌ ఇవ్వొచ్చు అని సోమువీర్రాజు ఎద్దేవా చేశారు.

ఏది ఏమైనా… పోలవరం విషయంలో మాత్రం అవినీతి తారాస్థాయిలో జరుగుతుందనే విషయాలు, విమర్శలు రోజు రోజుకీ బలపడుతున్న నేపథ్యంలో… పోలవరం అంచనాలు, వ్యయాలు, నిధులు, ఖర్చులపై బాబు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడుతుందనేది పలువురి మాటగా ఉంది. అలాకాని పక్షంలో… రాబోయే ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపై ఎంక్వైరీ వేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు!