Home రాజకీయాలు టీడీపీకి “అనధికార ప్రతినిధి” అయ్యారా శివాజీ?

టీడీపీకి “అనధికార ప్రతినిధి” అయ్యారా శివాజీ?

SHARE

తాను టీడీపీకి మద్దతుదారుడిని కాదు కాదు అని పైకి గట్టిగా చెబుతున్నా… ఆయన చెప్పే ప్రతిమాట, వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పనీ.. బాబుకు కొమ్ముకాస్తున్నట్లుగా, ప్రతిపక్షాలను విమర్శిస్తున్నట్లుగానే ఉంటుంది అనడంలో ఎవరికీ సందేహం ఉండకపోవచ్చు. స్పందించే గుణం ఉన్నప్పుడు అన్నింటిపైనా స్పందించాలి కానీ.. అధికాపక్షంపై దాడి పెరుగుతున్నప్పుడు మాత్రమే వచ్చి.. తాను న్యూట్రల్ మనిషినని జనాలకు చెబుతూ, అధికారపార్టీకి వంతపాడటం శివాజీ గొప్పతనం అనే విమర్శలు నిత్యం వినిపిస్తున్నే ఉన్నాయి. ఈ క్రమంలో తాజగా మరోమారు మైకుల ముందుకు వచ్చిన శివాజీ.. ఉక్కు పరిశ్రమ విషయంలో అంతా కలిసి రావాలని చెప్పుకొస్తున్నారు.

శివాజీ ఇంకా ఏమన్నారంటే… కడపలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలను పరామర్శించి సంఘీభావం తెలిపిన అనంతరం మాట్లాడిన శివాజీ… విభజనతో నష్టపోయిన తమ రాష్ట్రానికి హోదా చాలా అవసరమని, ఏపీ హక్కుల కోసం పార్టీలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇక్కడ శివాజీ గమనించాల్సిందేమిటంటే… వైకాపా ఎంపీలు హోదా కోసం ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు.. నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే వ్యక్తే అయితె, చంద్రబాబు వారికి అండగా ఉండాలి! అలాలేకపోయినా పర్లేదు కానీ… వాటిని డ్రామాలు అని దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అప్పుడు శివాజీ స్పందించారా? పోనీ ఇప్పుడు స్పందిస్తే ఎలా స్పందిస్తారు? సీఎం రమేష్ దీక్ష చేస్తుంటే ప్రాణత్యాగాలకు వెనుకాడని వ్యక్తి అంటున్నారు… మరి వైకాపా ఎంపీలు దీక్ష చేసినప్పుడు ఏమయ్యారు శివాజీ? హోదా అనేది వైకాపా కోసం కాదు కదా చేసింది… రాష్ట్ర ప్రయోజనాలకోసమే కదా!

కడప ఉక్కు పరిశ్రమ రాష్ట్రానికి చాలా అవసరం.. ఈ విషయంలో పోరాడుతున్న వారికి తన పూర్తి మద్దతు అని ప్రకటిస్తున్నారు శివాజి!

ఇక్కడ శివాజీ గమనించాల్సిందేమిటంటే… కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదన్న విషయం అటు మోడీ, ఇటు చంద్రబాబు కుర్చీలెక్కిన ఆరు నెలలకే తెలిసిన విషయం. ఈ నాలుగేళ్లు టీడీపీ నేతలు ఏమి చేశారని ప్రశ్నించాల్సింది పోయి… అంతా కలిసి రావాలని పిలుపునివ్వడం పై శివాజీనే సమాధానం చెప్పాలి. ఇదే క్రమంలో.. వైకాపా నేతలు సైతం దీక్షలు, ధర్నాలు చేస్తున్నప్పుడు మాత్రం శివాజీ ఎందుకు రారో!! అంటే… అధికారపక్షం కేంద్రంతో ఇంతకాలం డ్రామాలాడి, రాష్ట్రానికి అన్యాయం చేసి, ఇప్పుడు చేస్తున్న పనులేమో సరైనవి… నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాని సజీవంగా ఉంచిన వైకాపా పోరాటాలు మాత్రం రాజకీయాలా?

ఇక, ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు జంకుతున్నారు కానీ.. ఆ జంకు బయటపడనీయటం లేదనే విమర్శలపై కూడా శివాజీనే స్పందించేశారు. ప్రజలు ఓట్లేసీ అధికారం కట్టబెట్టిన పార్టీకి ఐదేళ్లు పాలించే అవకాశం ఇవ్వాలని.. సూచించేస్తున్నారు.

ఇక ఏపీ అప్పులపై కూడా శివాజీ “అనధికారిక హోదా”లో స్పందించేశారు. ఏపీకి రూ.2లక్షల కోట్ల అప్పు ఉందని కొందరు నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు, ప్రస్తుతం ఏపీకి రూ.82వేల కోట్ల అప్పు మాత్రమే ఉంది, అందులో విభజన వల్ల వచ్చిన అప్పే రూ.52వేల కోట్లు అని శివాజీ చెప్పుకొచ్చారు. ఇన్ని చెప్పిన శివాజీ… చివారాఖరున మరో మాట మాట్లాడారండోయ్… అదేంటంటే… తాను టీడీపీకి మద్దతివ్వడం లేదని!!

అక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే సుమా… రమణ దీక్షితుల వ్యవహారంపై కూడా శివజీ బాబు స్పందించేశారు. రమణ దీక్షితుల ఆరోపణలు వాస్తవాలో, అవాస్తవాలో శివాజీకి ఎలా తెలుసో కానీ… రమణ దీక్షితులు పదవి కోల్పోగానే టీటీడీపై విమర్శలు చేయడం సరికాదు, ఆయన్ని ఎవరూ తొలగించలేదు, ఆయన సేవలు ఇక చాలని ఆ వెంకటేశ్వరస్వామే విశ్రాంతి కల్పించారని చెప్పారు శివాజి. ఈ మాటలన్నీ విన్నవారు మాత్రం.. శివాజీ టీడీపీకి అనధికార ప్రతినిధి అయ్యారని కామెంట్స్ చేస్తున్నారు!!