Home రాజకీయాలు వదిన గారు కడిగిన విదంబెట్టిదనిన!

వదిన గారు కడిగిన విదంబెట్టిదనిన!

SHARE

ప్రస్తుతానికి బీజేపీ – టీడీపీ మధ్య జరుగుతున్న మాటల యుద్దంలో తాజాగా దగ్గుబాటి పురంధేశ్వరి ఎంటరయ్యారు. ఆ మాటా ఈమాటా లేకుండా డైరెక్టుగా చంద్రబాబుపై ఆమె సెటైర్లు, విమర్శలు కురిపించారు. తాజాగా పోలవరం ప్రాజెక్టును సందర్శించిన బీజేపీ టీం.. ఇది కేవలం సమీక్షలో భాగమే అని చెప్పుకున్న సంగతి తెలిసిందే. అనంతరం బాబు అండ్ కో బీజేపీపై విమర్శలు గుప్పించిన తరుణంలో… పురందేశ్వరి మైకుల ముందుకొచ్చారు.

బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నేరుగా విమర్శలు గుప్పించారు. నిద్రపోతున్న వారిని లేపవచ్చు కానీ నిద్రపోతున్నట్లు నటిస్తున్న చంద్రబాబు వంటి వారిని లేపటం తమ వల్ల కాదని ఆమె సెటైర్స్ వేశారు. మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ భేటీ అనంతరం స్పందించిన ఆమె… రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని.. రాష్ట్రంలో మహిళలపై నేరాలు అదుపుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నా కూడా అవేవీ పట్టనట్లు ప్రభుత్వం నటిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు.

తాము పోలవరం ప్రగతిని చూపించడానికే మీడియాను తీసుకువెళ్లామని మొదలుపెట్టిన పురందేశ్వరి.. రూ.1900 కోట్ల పోలవరం బిల్లులు ఇంకా కేంద్రానికి చేరలేదని.. కొత్త డీపీఆర్ ఇస్తే సరిపోదని, భూసేకరణ వివరాలు ఇస్తేనే నిధులు వస్తాయని స్పష్టం చేస్తున్నారు. కేంద్రం ఈ ప్రాజెక్టును బాధ్యతగా తీసుకున్న కారణంగా.. ప్రాజెక్టును సమీక్షించాల్సిన బాధ్యత తమపైన ఉందని తెలిపిన ఆమె… ఈ ప్రాజెక్టు విషయంలో ఇంకా చెల్లించని బిల్లులు లేవని సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకున్నట్టు తెలిపారు.

ఇదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీల రాజీనామాలపై కూడా పురందేశ్వరి స్పందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు డ్రామాలు అని టీడీపీ నేతలు మాట్లాడటం సరికాదని అన్నారు. డ్రామాలు, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడే చంద్రబాబు… వేరే పార్టీ వాళ్లను కేబినెట్లో చేర్చుకున్న దానికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఏది ఏమైనా… వదిన గారు చంద్రబాబుని కడగడం షురూ చేశారని, ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అని కాషాయ దళం కామెంట్స్ పెడుతుంది!!