Home రాజకీయాలు ఆ పత్రిక నెక్స్ట్ టార్గెట్.. జేసీ!

ఆ పత్రిక నెక్స్ట్ టార్గెట్.. జేసీ!

347
SHARE

బాబు చెప్పాలనుకున్నది ఆ పత్రిక ద్వారా కార్యకర్తలకు చేరవేస్తున్నారో.. లేక, చంద్రబాబుకు ఏమి చెప్పాలనుకునే విషయంపై కొందరు నేతలు ఆ పత్రికను నమ్ముకుంటున్నారో తెలియదు కానీ… టీడీపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు.. రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఎవరి వల్ల నష్టం, ఎవరి వల్ల లాభం వంటి విషయాలు నిత్యం ఆ పత్రికలో కథనాల రూపంలో కనిపిస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటివరకూ సర్వేల పేరుచెప్పి టీడీపీలో మంత్రిగా ఉన్న గంటాను ఆ పత్రిక టార్గెట్ చేసిన విషయం.. దీంతో గంటా తీవ్రంగా అలగడం, అనంతరం హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప బుజ్జగించడం తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా ఆ పత్రిక టార్గెట్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అని తెలుస్తుంది!

రాబోయే ఎన్నికల్లో అనంతపురంలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది కానీ.. వచ్చిన చిక్కంతా నేతల మధ్య సఖ్యత కొరవడటమే అని మొదలుపెట్టిన ఆ పత్రిక కథానాల్లో… చివరాఖరికి ఆ సమస్యకు మూలకారణం జేసీ దివాకర్ రెడ్డి అనే కంక్లూజన్ ఇచ్చే ప్రయత్నం చేసింది! జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంపీలంటే ఎమ్మెల్యేలకు పడటం లేదు.. ఎమ్మెల్యేలంటే ఎంపీలకు పడటం లేదు అనేది స్థానిక ప్రజలు చెబుతున్న మాటే కాకుండా.. పత్రికల్లో కూడ ఆ మేర కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి.. ఎంపీ దివాకర్‌రెడ్డి వర్గాల మధ్య చాలా గ్యాప్‌ ఉందని దానికి తాజా కారణం.. జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు పవన్‌ రెడ్డి అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంపై కన్నేశారన్నది కంప్లయింట్‌!

ఇదే క్రమంలో గుంతకల్లులో జితేంద్రగౌడ్‌ ను కాదని మధుసూదన్‌ గుప్తాను తీసుకొచ్చే ప్రయత్నం జేసీ దివాకర్‌రెడ్డి చేస్తున్నారనేది ఆ కథనంలో మరో సారాంశం. రాయదుర్గంలో కూడా మంత్రి కాలవ వర్గానికి ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి వర్గానికి కూడా అస్సలు పడటం లేదని రాసుకొచ్చింది. ఇదే క్రమంలో గతకొన్ని రోజుల కిందట.. జేసీ తయారు చేసిన ఒక జాబితాను కూడా ఇక్కడ ప్రస్థావించింది. వచ్చే ఎన్నికల్లో చాలా చోట్ల కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఎంపీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో కలకలం రేపాయని, ఈ విషయాన్ని సిట్టింగులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని.. ఈ రకంగా జేసీపై ఆరోపణలు, సాక్ష్యాలతో కూడిన కొన్ని విషయాలు వెళ్లడిస్తూ… రబోయే కాలంలో అనంతపురం జిల్లాలో టీడీపీకి జేసీ ఒక సమస్య కాబోతున్నారనే సంకేతాలు ఇచ్చింది!

దీంతో… ఆ పత్రిక నెక్స్ట్ టార్గెట్ జేసీ దివాకర్ రెడ్డి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతవరకూ క్లారిటీ వచ్చింది కానీ.. ఇది ఆ పత్రిక సొంత అభిప్రాయమా లేక, అధినేత ఆలోచనలకు ప్రతిరూపమా అనేది తెలియాల్సి ఉంది!