Home రాజకీయాలు ఆనం-గంటా భేటీ.. బాబు పరిస్థితేంటి?

ఆనం-గంటా భేటీ.. బాబు పరిస్థితేంటి?

SHARE

ప్రస్తుతం చంద్రబాబుకి ఉన్న టెన్షన్స్ చాలవన్నట్లుగా.. అంతర్గత సమస్యలు రోజు రోజుకీ పెరిగిపోతున్నట్లుగా కనిపిస్తున్నాయి. దానికి బాబు వైఖరే కారణం అని కొందరంటుంటే.. చిన బాబు అవగాహనా రాహిత్య పెత్తనం కారణం అని మరికొందరు చెబుతుంటుంటారు. ఈ క్రమంలో సర్వేల పేరు చెప్పి గంటా శ్రీనివాస రావును ఇరుకున పెట్టడానికి ప్రయత్నించిన టీడీపీ అధిష్టానానికి రివర్స్ లో గంటా షాక్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది తాజా సంఘటన. దీంతో… అసంతృప్తితో రగిలిపోతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు కొత్త ఎజెండాను సిద్ధం చేస్తున్నారా? పార్టీలోని అసంతృప్తులందరినీ ఆయన ఏకం చేయదలిచారా? ఇందులో భాగంగా సీనియర్ నేతతో ఈ కార్యక్రమానికి కొబ్బరి కాయకొట్టారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

ఇందులో భాగంగా… మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఏకాంత భేటీ ఎపి రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిందనే చెప్పుకోవాలి. ఈ ఇరువురి మధ్య జరిగిన చర్చల సారాంశం బైటకు ఏమాత్రం వెల్లడి కానప్పటికీ.. రాజకీయంగా మాత్రం ఈ భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్ని రోజులు క్రితం.. బాబుపై అసంతృపితిగా ఉన్న ఆనం.. తనకు అవమానం జరిగిందని బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో పార్టీ ప్రవర్తనతో అసంతృప్తితో రగిలిపోటున్న గంటా కలవడం, కలిసి ఏకాంతంగా చర్చించడంతో ఈ భేటీకి అధిక ప్రాధాన్యం ఏర్పడింది.

అయితే.. ఆనం వివేకా మరణం నేపథ్యంలో ఆయన సోదరుడిగా తనను పరామర్శించడానికే మంత్రి గంటా వచ్చారు తప్ప తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని ఆనం రామనారాయణ రెడ్డి చెబుతున్నా… అది కూడా ఒక కారణం అవ్వొచ్చు తప్ప, అదే పూర్తి కారణం అంటే నమ్మే పరిస్థితిలో ప్రస్తుత రాజకీయాలు లేవనేది పలువురి మాటగా ఉంది. గత వారం పదిరోజులుగా పార్టీకి – పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మంత్రి గంటా శ్రీనివాసరావు.. హోంమంత్రి బుజ్జగింపులతో చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా అలక వీడిన సంగతి తెలిసిందే. అయితే ఇది కేవలం తాత్కాలికమేనని అప్పట్లో కథనాలు వచ్చాయి.. అవి పూర్తి వాస్తవం అనే పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. పైగా జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర టీడీపీ సీనియర్ నాయకులు ఎవరూ లేకుండానే ఈ బేటీ జరగడంతో.. బాబు తాజా పరిస్థితిపై తమ్ముళ్లలో టెన్షన్ మొదలైందట. ఆనం నివాసానికి వెళ్లి ఇంత రహస్యంగా ఎందుకు గంటా సమావేశం కావాల్సి వచ్చిందనే విషయంపై అధినేత ఆరాలు తీస్తున్నారని తెలుస్తుంది.