Home రాజకీయాలు కడప ఉక్కు – బ్రహ్మణీ స్టీల్స్‌.. మధ్యలో గాలి!

కడప ఉక్కు – బ్రహ్మణీ స్టీల్స్‌.. మధ్యలో గాలి!

SHARE

గతకొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో కడప ఉక్కు ఫ్యాక్టరీ వ్యవహారం ఒక హాట్ టాపిక్ గా మారింది! కడప ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కు నివేదిక ఇచ్చిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో… ఆ విషయం తమకు అప్పుడే తెలిసిందన్నట్లుగా డ్రామాలకు తెరలేపిన టీడీపీ నేతలు.. తమ బండారం ఎక్కడ బయటపడుతుందో అని దీక్షలు మొదలెట్టేశారు. ఈ విషయంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే ఈ విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చినా.. నాడు మౌనంగా ఉన్న చంద్రబాబు.. బీజేపీతో చెడిన తర్వాత ఈ విషయాన్ని గుర్తుచేసుకోవడంపై.. ఇది రాజకీయ క్రీడ కాక మరేమిటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కడప ఉక్కు ఫ్యాక్టరీ వ్యవహారంపై కర్ణాటక బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి స్పందించారు.

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఆందోళనలు ఉధృతమౌతున్న నేపథ్యంలో కర్ణాటక బిజెపి నేత గాలి జనార్థన్‌ రెడ్డి స్పందించారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మించడం సాధ్యం కాదంటూ ఏపీ ప్రభుత్వం – మెకాన్ సంస్థ ఇచ్చిన నివేదికను తప్పు బట్టిన ఆయన.. కడప జిల్లాలో స్టీలు ప్లాంటు స్థాపించాలనే డిమాండ్‌ తో జరుగుతున్న పోరాటాలపై స్పందించారు. 2007, జూన్‌ 10న జమ్మలమడుగులో బ్రహ్మణి ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ పేరిట స్టీలు ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని గుర్తు చేసిన గాలి.. నాడు ఇదే మెకాన్ సంస్థ.. కడపలో ఉక్కు పరిశ్రమకు అన్ని అవకాశాలు ఉన్నాయని నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అదే సంస్థ.. ఏపీ ప్రభుత్వంతో కలిసి.. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఫీజుబిలిటీ కాదని చెప్పడంపై గాలి జనార్ధన్ రెడ్డి మండిపడుతున్నారు. దీంతో.. దీని వెనక ఉన్న అసలు గుట్టు ఏమిటనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.

ఇదే క్రమంలో… ఈ స్టీలు ప్లాంటు ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికిపైగా ఉపాధి లభిస్తుందని, అందుకే గతంలో దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ ను తాను స్టీలు ప్లాంటు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు తెలిపిన జనార్ధన్ రెడ్డి… ప్రస్తుత ప్రభుత్వం తనకు అనుమతి ఇస్తే రెండేళ్లలో స్టీలు ప్లాంట్ నిర్మించి చూపిస్తానని చెబుతున్నారు. అలాకానిపక్షంలో… కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా స్టీల్ ప్లాంట్ నిర్మించినా తనకు ఎటువంటి అభ్యంతరం లేదదని, అయితే బ్రహ్మణీ స్టీల్స్‌ కోసం తాను ఇప్పటి వరకూ దాదాపు 1350 కోట్లు ఖర్చు చేసినందున.. ఈ పనులను వేరేవారికి అప్పగిస్తే తాను పెట్టిన పెట్టుబడి తిరిగి ఇచ్చేయాలని గాలి జనార్థన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం విషయంలో బాబు.. మెకాన్ సంస్థ నాటి, నేటి నివేదికలపై క్లారిటీ ఇప్పించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది!

ఈ విషయంలో బాబుకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిన గాలి జనార్ధన్ రెడ్డి… ఇదే విషయమై చంద్రబాబును కలవడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. కడపలో స్టీలు ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు పిలిస్తే.. వెంటనే వెళ్లి, కడప బ్రాహ్మాణి స్టీల్స్‌ కు సంబంధించిన అన్ని వివరాలు అందజేస్తానని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ ఫ్యాక్టరీని నిర్మించుకోవచ్చని చెబుతున్నారు! దీంతో.. ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి బాబు కోర్టులోనే పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే… కేంద్రం పేరున రాష్ట్రానికి జరిగిన అన్ని అన్యాయాల్లోనూ బాబు పాత్ర ఉందనే అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తపరుస్తున్నారు!!