Home రాజకీయాలు వైఎస్ దమ్ముపై దానం క్లారిటీ!

వైఎస్ దమ్ముపై దానం క్లారిటీ!

1511
SHARE

ప్రస్తుతం తెలంగాణలో సాగుతున్న తెరాస ఏకచత్రాధిపత్యానికి కాంగ్రెస్ ఏమైనా కాస్త అడ్డుకట్టవేస్తుందేమో అని ఆశించే కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పుడప్పుడూ కాస్తో కూస్తో ధైర్యం ఇచ్చినట్లు కనిపించే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. అంతలోనే చేజేతులా తమ కార్యకర్తల నమ్మకాన్ని పాతాళానికి తోసేస్తుంటుంది. ఇప్పటికే అంతర్గత ప్రజాస్వామ్యం పేరుచెప్పి అంతర్గత కుమ్ములాటలతో నిండిపోయిన తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల్లో ఒకరైన దానం నాగేందర్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరినీ పేరు పెట్టి డ్యామేజ్ చేయకుండా రాజీనామా చేసిన దానం.. అనంతరం పార్టీని పై ఒకవైపు కావాల్సినన్ని సెటర్స్ వేస్తూ.. తమ పార్టీ నేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసల వర్షాలు కురిపించారు. ఈ రకంగా తనకు వైఎస్ పై ఉన్న అభిమానాన్ని చాటిచెప్పాలని అనుకున్నారో లేక.. మిగిలిన కాంగ్రెస్ నాయకులు ఆదర్శవంతుడైన వైఎస్ నాయకత్వ లక్షణాలను, పార్టీని నడిపించిన విషయాలను గుర్తుచేస్తున్నారో తెలియదు కానీ… వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక శికరం, ఆయనలా దమ్మున్న నేత కాంగ్రెస్ లో ఒక్కరు కూడా లేరు అని తేల్చి చెప్పారు దానం!

ఇప్పుడంతా పార్టీ నుంచి ఆశించే వ్యక్తులే తప్ప.. పార్టీకి ఏమైనా చేయాలనే వ్యక్తులు లేరని మొదలుపెట్టిన దానం… వైఎస్ పార్టీ నుంచి ఆశించే వ్యక్తి కాదని, పార్టీకే తాను ఏదైనా చేయాలని ఆలోచించే వ్యక్తి అని.. వైఎస్ రాజకీయ వ్యక్తిత్వాన్ని, పార్టీపై గౌరవాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీని కాపాడగలిగే ధైర్యం ఆ పార్టీలో వైఎస్ కి తప్ప ఇంకొకరికి లేరని తేల్చి చెప్పిన దానం… వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో బడుగుబలహీన వర్గాలకు తగిన ప్రాధాన్యత లభించిందని తెలిపారు.

ఈ క్రమంలో వైఎస్ వ్యక్తిత్వానికి సంబందించి మరో ఉదాహరణ చెప్పిన దానం నాగేందర్… ఎవరికైనా, తనకైనా.. వైఎస్ కు ఏదైనా నేరుగా చెప్పే చనువు ఉండేదని, తాను కూడా ఏదైనా చెప్పినా వైఎస్ కాస్త ఆలోచించి, ఆ విషయాన్ని పట్టించుకునేవారని.. తన తోటి నాయకులను పైకి తీసుకురావాలనే ఆలోచన వైఎస్ సొంతం అని దానం తెలిపారు. వైఎస్ అనంతరం పార్టీని ఎవరూ పైకి తీసుకురారని, ఒక వేళ తీసుకొద్దామన్నా.. తీసుకురానివ్వరు అని దానం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏది ఏమైనా… సందర్భం వచ్చిందనో లేక వైఎస్ పై తనకున్న ప్రేమను చెప్పాలనో కానీ… తెరాసలోకి వెళ్తూ వెళ్తూ.. వైఎస్సార్ ని పొగడ్తలతో ముంచెత్తారు దానం నాగేందర్!