Home రాజకీయాలు కమ్యునిస్టుల వెటకారం మామూలుగా లేదుగా!

కమ్యునిస్టుల వెటకారం మామూలుగా లేదుగా!

232
SHARE

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు కాంగ్రెస్ దిక్కు కాకపోయినా.. కమ్యునిస్టులు కలిసే అవకాశం ఉందని గతంలో కొన్ని కథనాలు వచ్చాయి. అయితే.. కమ్యునిస్టులు జనసేనతో కలవచ్చు లేదా ఒంటరిగా మౌనంగా ఉండొచ్చు, లేదా చంద్రబాబుకు వ్యతిరేక వైఖరి ప్రచారం చేయొచ్చు అనే కథానాలు కూడా వచ్చాయి. ఆ సంగతులు అలా ఉంటే.. మిగిలిన విషయాల్లో ఎలాఉన్నప్పటికీ.. హోదా విషయంలో మాత్రం చంద్రబాబుపై నిత్య విమర్శలు కురిపిస్తున్నారు కమ్యునిస్టులు. మరి ముఖ్యంగా మోడీ విషయంలో బాబు అనుసరిస్తున్న మెతకవైఖరి (ఏపీలో కాదు.. ఢిల్లీలో) విషయంలో కమ్యునిస్టులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

తాజాగా నీతీఅయోగ్ సమావేశంలో పాల్గొన్న బాబు చేసిన పనులు, వ్యవహరించిన మెతకవైఖరి, ఆ సమావేశం వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమిటి అనే విషయాలపై స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. చంద్రబాబుపై వ్యంగ్య బాణాలు సంధించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి, మోడీతో స్నేహహస్తం కోసం చంద్రబాబు చేతులు కలపడం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానపర్చడమేనని మొదలుపెట్టిన రామక్రిష్ణ.. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం చంద్రబాబు ఎంచుకున్న పోరాట పంథా ఇదేనా? అంటూ నిలదీస్తున్నారు. ఈ సందర్భంగా తనదైన వెటకారం ఆడిన ఈ కమ్యునిస్టు… మోడీ ఎడమ చెయ్యి ఇస్తేనే బాబు ఎగిరి గంతులేశారు.. అదే గనక పొరపాటున కుడి చెయ్యి ఇస్తే.. బాబు భూమిపై నిల్చేవాడే కాదని ఎద్దేవా చేస్తున్నారు.

అనంతరం ఎల్లో మీడియాని టార్గెట్ చేసిన రామకృష్ణ… చంద్రబాబు పర్యటనతో భూగోళం బద్దలవుబోతున్నట్టు ఎల్లో మీడియా ప్రచారం చేసిందని.. కాని చివరికీ ఏం జరిగిందో అందరూ చూశారని విమర్శించారు. మోసపూరిత మాటలు, మోసపూరిత పర్యటనలు ఇప్పటికైనా చంద్రబాబు మానుకోవాలని ఈ సందర్భంగా రామకృష్ణ హితవు పలికారు. ఈ రేంజ్ లో కమ్యునిస్టులు బాబుపై విమర్శలు, వ్యంగాస్త్రాలు విసిరే సరికి.. టీడీపీ నేతల నుంచి మౌనమే సమాధానంగా ఉంది! ప్రస్తుతం ఈ కామెంట్స్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి.