Home రాజకీయాలు “సీనియర్” బాబుకి ఐవైఆర్ చురకలు!

“సీనియర్” బాబుకి ఐవైఆర్ చురకలు!

SHARE

మాట్లాడితే.. మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి.. తాను సీనియర్ సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. తన సీనియారిటీకి తెలిసిన విషయాల్లో కూడా తప్పులు చేస్తున్నారని.. అపార అనుభవం గల వ్యక్తి, తన వ్యక్తిగత ప్రయోజనలాకోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో జూదమాడుతున్నారని రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ చేసేవారిలో కేవలం ప్రతిపక్ష నాయకులే కాకుండా.. మేధావులూ, రాజకీయ విశ్లేషకులు, మాజీ ఐఏఎస్ లు కూడా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో అవకాశం చిక్కినప్పుడల్లా తనదైన సూచనలు చేస్తూ.. వాటిలో అంతర్లీణంగా చురకలు వేసే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశాలని బహిష్కరించకూడదన్న చిన్న చిన్న విషయాలు.. ఈ సీనియర్ మోస్ట్ చంద్రబాబుకు తెలియకపోవడం దారుణమని వ్యాఖ్యానిస్తూ… తనదైన ట్వీట్ చేసారు ఐవైఆర్ కృష్ణారావు. కేంద్రంలో ఉన్న బీజేపీతో విభేదాల వల్ల రాష్ట్రాలకు ఏదో అన్యాయం జరిగిపోతుందని చెబుతున్న బాబు.. అది కేవలం తన అసమర్ధత అన్న విషయాన్ని దాస్తున్నారనేది నిత్యం వినిపిస్తున్న కామెంట్. ఈ క్రమంలో కృష్ణారావు ట్వీట్ ఆలోచింపచేసేలా ఉంది. “కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ పరిపాలనలో ఉండటం ఇదే తొలిసారి కాదు, గతంలోనూ ఈ విధంగా ప్రభుత్వాలు నడిచాయి, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాజకీయంగా విభేదించినా, ఒక తలుపు తెరిచి ఉంచి.. రాష్ట్ర ప్రయోజనాలను విపక్షాలు కాపాడుకుంటాయి” అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు ట్విటర్‌లో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ విషయాన్ని తన వ్యక్తిగత స్థాయికి తీసుకురావడంతో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతోందని కృష్ణారావు చెబుతున్నారు. ఈ విషయంలో టీడీపీ అస్మదీయ ప్రసార మాధ్యమాలు అగ్నికి ఆజ్యం పోసేవిధంగా ప్రవర్తిస్తున్నాయని విమర్శించిన ఆయన… ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశాన్ని రాష్ట్రం బహిష్కరించిందని తెలిపారు. చెరువు మీద అలిగితే చెరువుకు నష్టం కాదన్న విషయం.. అపార అనుభవం గల చంద్రబాబుకు తెలియంది కాదని చురక వేశారు. విపక్షంలో ఉంటూనే కరుణానిధి తమిళనాడుకు ప్రయోజనాలు కాపాడారని తెలిపిన ఆయన.. ఈ విషయంలో చంద్రబాబు విఫలమయ్యారని పరోక్షంగా విమర్శించారు.

ఈ విషయాలపై స్పందించిన విశ్లేషకులు… ఐవైఆర్ వ్యాఖ్యల్లో పూర్తి వాస్తవం ఉందని చెబుతున్నారు. బీజేపీతో టీడీపీకి చెడినంత మాత్రాన్న.. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రప్రభుత్వానికి చెడినట్లు కాదని.. ఇది ప్రజాస్వామ్య దేశమని.. ఈ విషయంలో బాబు అసమర్ధత కనిపిస్తుందే తప్ప, కేంద్రం వైఖరిని పూర్తిగా తప్పుపట్టలేమని విశ్లేషిస్తున్నారు!!