Home రాజకీయాలు జేసీపై జాలిపడుతున్న బాబు బాధితులు!

జేసీపై జాలిపడుతున్న బాబు బాధితులు!

SHARE

చంద్రబాబు నాయుడు సంగతి పూర్తిగా తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో తెలియదు కానీ… టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటున్నారని అంటున్నారు టీడీపీ సీనియర్లు! దానికి కారణం లేకపోలేదు సుమా..! తాజాగా అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి పేల్చిన ఒక బాంబే దీనికి కారణం! రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు? అనంతపురం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు? వంటి జాబితా ఒకటి రెడీ చేసుకున్న జేసీ.. దానికి బాబు అంగీకరిస్తారని భ్రమలో తెగ మాట్లాడుతున్నారట!

విషయానికొస్తే… తాజాగా జరిగిన ఒక సమావేశంలో మాట్లాడిన జేసీ… వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని 14 స్థానాల్లో పార్టీ గెలవటానికి తాను ఒక జాబితాను సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఎందుకిలా చేశారయ్యా అంటే.. ప్రస్తుతం ఉన్న సిట్టింగుల్లో ఇద్దరు ముగ్గురు తప్పించి మిగిలినోళ్లంతా వచ్చే ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమని అంటున్నారు జేసీ! ఆ విషయాలు తనకు తెలిసినందుకే… గెలుపు గుర్రాల మీద తాను ఒక జాబితాను తయారు చేసిన సీఎం బాబుకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో అనంత టీడీపీ నేతలు, సిట్టింగులూ జేసీ ప్రకటనపై రగిలిపోతున్నారు. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారో చెప్పటానికి జేసీ ఎవరంటూ నిలదీస్తున్నారు.

ఆ సంగతులు అలా ఉంటే… క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకునే టీడీపీలో జేసీ ఇలాంటి ఒక జాబితాను తయారు చేస్తే.. అది రహస్యంగా చంద్రబాబుకి ఇవ్వాలి! అలా కాని పక్షంలో అందరి సమక్షంలో బాబు ముందు ఉంచాలి. అలా కాకుండ… తనకు తానే ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించ గలిగే ఆత్మవిశ్వాసం, నమ్మకం, దైర్యం.. జేసీ కి ఎందుకు వచ్చాయబ్బా.. ఎలా వచ్చాయబ్బా అనేది అనంతతో పాటు రాష్ట్రం మొత్తం మీద ఉన్న టీడీపీ నేతలు తెగ ఆలోచిస్తున్నారట. దీనికీ కారణం ఇదై ఉండొచ్చని చెబుతున్నారు బాబు బాదితులు!

ఈ మధ్యకాలంలో వైకాపా అధినేత జగన్ పై జేసీ దివాకర్ రెడ్డి తెగ విరుచుకుపడుతున్నారు. ఎప్పుడోగాని నవ్వని బాబును ఈ మధ్య తెగ నవ్వించేస్తున్నారు. జగన్ పై జేసీ చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలు, అనైతిక విమర్శలకు బాబు ముసి ముసి నవ్వులు నవ్వేసుకుంటున్నారు. ఈ విషయం గమనించిన జేసీ… ఇక బాబుకు తాను ఒక ట్రంప్ కార్డు అయిపోయానని, ఇక బాబు నమ్మకమైన కోటరీలో తాను కూడా ఒక ప్రధాన పాత్రదారి అని ఊహించుకుంటున్నారట. ఈ విషయం గమనించిన సీనియర్లు, బాబు బాదితులు మాత్రం…. ఇలాంటివి టీడీపీలో అత్యంత సహజం అని, జేసీని ఫుల్ గా వాడేస్తున్న విషయం తెలుసుకోలేకపోతున్నారని అంటున్నారు.

ప్రస్తుతం జేసీకి మరో పార్టీకి వెళ్లే ఆప్షన్ లేదు! కాంగ్రెస్ కు వెళ్లరు, వైకాపా వాళ్లు రానివ్వరు, బీజేపీతోనూ ఛాన్స్ లేదు.. ఈ క్రమంలో కచ్చితంగా టీడీపీని నమ్ముకునే జేసీ అండ్ ఫ్యామిలీ ఉండాలి! ఈ క్రమంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్న జేసీకి… తాను అడిగినచోట, తాను అడిగిన వారికి బాబు సీట్లు ఇచ్చేస్తారని అనుకోవడం అత్యంత భ్రమ అని పలువురు అభిప్రాయపడుతున్నారట. జేసీ, జగన్ ను ఎంత తిట్టినా, ఆ మాటలకు బాబు ఎంత నవ్వినా, మురిసిపోయినా… జేసీని ఎక్కడ అవసరమో అక్కడే ఉపయోగింఛుకుంటారు తప్ప… ఇలా పెత్తనం ఇచ్చే పనికి బాబు పూనుకోరని.. ఈ విషయం జేసీ ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిదని హితవు పలుకుతున్నారట. బాబు వాడకం అంటే ఏమిటో జేసీకి తోందర్లోనే తెలుస్తుందనే.. చంద్రబాబు బాధితుల సిన్సియర్ సలహా టు జేసీ!!!