Home సినిమా రివ్యూ నా నువ్వే మూవీ రివ్యూ : డెస్టినీ మేజిక్ మిస్సయింది

నా నువ్వే మూవీ రివ్యూ : డెస్టినీ మేజిక్ మిస్సయింది

SHARE

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, తమన్నా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, సురేఖావాణి, ప్రవీణ్, ప్రియదర్శి, ఆర్జే హేమంత్, బిత్తిరి సత్తి తదితరులు
సంగీతం: శరత్
ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్
నిర్మాతలు: కిరణ్ ముప్పవరపు – విజయ్ కుమార్ వట్టికూటి
రచన – దర్శకత్వం: జయేంద్ర
రేటింగ్ : 2.25/5

ఇటీవల కాలంలో విలక్షణ పాత్రలతో, విభిన్నమైన చిత్రాలతో అలరిస్తున్నారు హీరో నందమూరి కల్యాణ్ రామ్. నందమూరి బ్రాండ్ అండగా ఉన్నా దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగపరుచుకోలేక కెరీర్ ని ఇంకా ఎత్తుపల్లాల మీదే నడిపిస్తున్న హీరో కళ్యాణ్ రామ్. ఒకటి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకున్నా దాన్ని పూర్తిగా వాడుకోవడంలో మాత్రం ఇప్పటిదాకా ఫెయిల్ అవుతూ వచ్చాడు కళ్యాణ్ రామ్. అందుకే నా నువ్వేలో కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడు అని తెలిసినప్పుడు ప్రేక్షకులు అంత ఆసక్తి చూపలేదు.

యాక్షన్ హీరోగా ముద్ర వేసుకొన్న కల్యాణ్ రామ్ రూట్ మార్చి అందమైన ప్రేమకథా చిత్రం నా నువ్వేతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాడ్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర రూపొందించిన ఈ చిత్రంలో ఆయనకు జంటగా తమన్నా భాటియా నటించారు. పీసీ శ్రీరాం ఈ ప్రేమకథను అందంగా మలిచేందుకు ప్రయత్నించారని బలంగా సినీ వర్గాల్లో వినిపించింది. లవర్ బాయ్ ఇమేజ్‌తో 14వ తేదీన ముందుకు వచ్చిన కల్యాణ్ రామ్ ప్రేక్షకులను మెప్పించారా అని తెలుసుకోవాలంటే నా నువ్వే కథేంటో తెలుసుకోవాల్సిందే.

కథ

మీరా (తమన్నా భాటియా) మేజిక్ 100FM ఛానల్ లో రేడియో జాకీ.  డెస్టినీ(విధి)ని బలంగా నమ్ముతుంది. వరుణ్ (కల్యాణ్ రామ్) అమెరికాకు వెళ్లాలనుకొనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వీరిద్దరి ప్రేమకు లవ్ సైన్ అనే పుస్తకం బీజం వేస్తుంది. వరుణ్ ఫోటోను చూసిన వెంటనే అతడిని తన లక్కీగా భావిస్తుంది. తనకు తెలియకుండానే ప్రేమలో పడిపోతుంది. కొన్ని సంఘటనల తర్వాత వరుణ్ మీరాను కలుస్తాడు. డెస్టినీ విషయం లో అభిప్రాయభేదం కలిగిన వరుణ్ మీరాతో ఒక బెట్ కడతాడు. తర్వాత కొన్ని పరిణామాల తర్వాత ఇద్దరూ విడిపోతారు. డెస్టినీ ఇద్దరిని కలిపిందా లేదా అనేదే ఓ రైల్వే స్టేషన్ లో ముగిసే నా నువ్వే కథ.

నటీనటులు
కళ్యాణ్ రామ్ బ్యాడ్ లక్కో లేక ప్లానింగ్ లో లోపమో తెలియదు కానీ పరిశ్రమకు వచ్చి పదేళ్లు దాటినా ఇంకా తనకంటూ బలమైన మార్కెట్ సృష్టించుకోలేకపోయాడు. తన కంటే చాలా లేట్ గా వచ్చిన జూనియర్ హీరోలు అప్పుడే పాతిక కోట్ల మార్కెట్ కు చేరుకోగా తాను మాత్రం ఇంకా నిరూపించుకునే స్టేజిలో ఉండటం సినిమాలో చూపించిన థీమ్ ప్రకారం చెప్పాలంటే విధి రాతేమో. మాస్ సినిమాలు తనకు నప్పుతున్నా వాటిని సరిగ్గా డీల్ చేసే దర్శకులను పట్టుకోవడంలో ఫెయిల్ అవుతుండటంతో కళ్యాణ్ రామ్ కు సక్సెస్ అందని పండులాగే మిగిలిపోయింది.

తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ పోల్చకూడదు కానీ విడిగా చూస్తే కళ్యాణ్ రామ్ కొందరు స్టార్ హీరోలకు ధీటుగా మంచి నటనను ఇవ్వగలడు. నా నువ్వేలో కూడా అదే ప్రయత్నం చేసాడు. విధిరాతను నమ్మకుండా తన మీద తాను ఆధారపడే వరుణ్ పాత్రలో కళ్యాణ్ రామ్ చేయగలిగినదంతా చేసాడు కానీ కంటెంట్ చాలా లైట్ గా ఉండటంతో పాటు ప్రెజెంటేషన్ వీక్ గా ఉండటంతో ఆశించిన ఫలితం దక్కడం కష్టమే. ఫేస్ లో గ్రేస్ తగ్గడం కూడా కళ్యాణ్ రామ్ కు మైనస్ అయ్యింది.

మీరా పాత్రలో తమన్నా ఒదిగిపోయింది. గ్లామర్‌ షోతో కుర్రకారును ఫిదా చేసిన తమన్నా నటనలోనూ ఫుల్‌ మార్క్స్‌ సాధించింది. రొమాంటిక్‌ సీన్స్‌తో పాటు ఎమోషనల్‌ సీన్స్‌లోనూ తమన్నా నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పోసాని కృష్ణమురళీ తెర మీద కనిపించింది తక్కువ సేపే అయిన ఉన్నంతలో తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. హీరోయిన్‌ తండ్రి తనికెళ్ల భరణీ తనకు అలవాటైన రొటీన్ పాత్రలో కనిపించారు. ప్రవీణ్‌, వెన్నెల కిశోర్‌, సురేఖ వాణి, ప్రియదర్శి తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం 
ప్రేమ కథలు అతి తక్కువ పాత్రలతో ప్రెజెంట్ చేసినప్పుడు అవి సక్సెస్ కావడం పూర్తిగా ప్రెజెంటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. దర్శకుడు జయేంద్ర అలాంటి ప్రయత్నమే నా నువ్వేతో చేసాడు. డెస్టినీ(విధి) అనే పాయింట్ చుట్టూ హీరో హీరోయిన్ మధ్య ఆసక్తికరమైన డ్రామాతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వాలనుకున్న జయేంద్ర పేపర్ మీద రాసుకున్న పాయింట్ ని తెరమీద అంతే అందంగా మలచడంలో ఫెయిల్ అయ్యాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి ప్రధానంగా కావాల్సింది ఎమోషన్. స్లోగా కథను చెప్పినంత మాత్రాన అది పండుతుంది అనుకోవడం అమాయకత్వం. జయేంద్ర ఈ విషయంలోనే తప్పు చేసారు.

ఇలాంటి లైన్ తోనే గత ఏడాది విక్రమ్ కుమార్ అఖిల్ హలో సినిమా విషయంలో మెప్పించలేక డిజాస్టర్ ఇచ్చాడు. జయేంద్ర కూడా అదే కోవలో చేరిపోయాడు. డెస్టినీ అంటూ హీరోయిన్ తో పదే పదే చెప్పించి దాని పక్క నుంచి కథను ఆసక్తికరంగా మలుపు తిప్పే అవకాశాన్ని ఎక్కడా తీసుకోకపోవడం ఫస్ట్ హాఫ్ లోనే విసిగించడం మొదలుపెడుతుంది. విషాదం ఏంటంటే అసలు కథ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకుడు ఒక పక్క ఎదురు చూస్తూ ఉంటే మరోపక్క తాను చెబుతున్నది అసలు కథేగా అంటూ దర్శకుడు తనకు తోచింది అనిపించింది తీసుకుంటూ పోయాడు. ఈ రెండింటి మధ్య సింక్ కాలేక నా నువ్వే నలిగిపోయింది.

ఇంటర్వెల్ ముందు కాస్త ఆసక్తి రేపే ప్రయత్నం చేసినా ఆ తర్వాత టెంపో క్యారీ చేయటంలో జయేంద్ర తడబడటం ఫ్లో ని దెబ్బ తీసింది. పదే పదే డెస్టినీ అంటూ విసిగించిన జయేంద్ర ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించేలా తీయలేకపోవడం కూడా డెస్టినీ అనుకుని సర్దుకోవాల్సిందే.

శరత్ సంగీతం మరీ గొప్పగా లేకపోవడం ఇందులో మరో మైనస్. నేపధ్య సంగీతం వరకు పర్వాలేదు అనిపించాడు కానీ ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాలి అనిపించడం సహజం. మీరఖ్-కిరణ్ మాటలు సహజంగా ఉన్నాయి. ఇక భారతదేశం గర్వించదగ్గ కెమెరామెన్ లో ఒకరైన పిసి శ్రీరామ్ తన వంతు బాధ్యతను అనుభవాన్ని రంగరించి చక్కగా నిర్వర్తించారు. కాకపోతే సబ్జెక్టు పరిధి తక్కువ కాబట్టి ఆయన నైపుణ్యాన్ని పూర్తిగా వాడుకోలేదు అనిపిస్తుంది. సతీష్ ఎడిటింగ్ గురించి కంప్లైంట్ లేదు. స్లోగా ఉన్నవన్నీ కత్తిరిస్తూ పోతే నా నువ్వే గంట కూడా రాదు. నిర్మాతలు కిరణ్, విజయ్ కుమార్ ఇది మరీ భారీ కాన్వాస్ డిమాండ్ చేసే స్టోరీ కాదు కాబట్టి చాలా మటుకు సేఫ్ అయ్యారు. రిచ్ నెస్ తగ్గకుండా క్వాలీటి మైంటైన్ చేసేందుకు దర్శకుడు అడిగినవి ఇచ్చినట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.

పాజిటివ్ పాయింట్స్ 
తమన్నా
పిసి శ్రీరామ్ ఛాయాగ్రహణం

నెగటివ్ పాయింట్స్ 
స్లో నెరేషన్
కామెడీ లేకపోవడం
క్లైమాక్స్
సెకండ్ హాఫ్ ఓవర్ డ్రామా
స్క్రీన్ ప్లే

చివరి మాట
కల్యాణ్ రామ్‌ లాంటి మాస్‌ హీరోతో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కించిన దర్శకుడు జయేంద్ర అనుకున్న స్థాయిలో అలరించలేకపోయాడు. కళ్యాణ్ రామ్ కొత్తగా ట్రై చేసాడు కాబట్టి నా నువ్వే కూడా అంతే కొత్తగా ఉంటుంది అని ఆశిస్తే మాత్రం ఇది  మీ అంచనాలు అందుకోదు. లాజిక్ లేకుండా డెస్టినీ అనే పాయింట్ చుట్టూ ఏదో గొప్ప లవ్ స్టొరీ తీస్తున్నాను అని భ్రమపడి ఒక మామూలు కథనే చూపించాడు దర్శకుడు. ఎమోషన్, సోల్ అనే పదాలకు దూరంగా ఓ రెండు గంటలు థియేటర్లో కుదురుగా కూర్చోబెట్టడం కూడా భారంగా ఫీల్ అయ్యేలా చేసిన నా నువ్వే ఓపిక ఉంటే తప్ప పెట్టుకోవాల్సిన ఛాయిస్ కాదు.

నా నువ్వే డెస్టినీ మేజిక్ మిస్సయింది