Home రాజకీయాలు ఉక్కు పాపం బాబుదే అంటున్న బీజేపీ!

ఉక్కు పాపం బాబుదే అంటున్న బీజేపీ!

SHARE

విభజన హామీల్లో ఒకటైన కడప ఉక్కు కర్మాగారంపై వస్తున్న వార్తల్లో పూర్తివాస్తవాలు లేవని అంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. తాజాగా ఢిల్లీలో మాట్లాడిన ఆయన… తెలుగుదేశం చంద్రబాబు ప్రభుత్వం.. సిగ్గు లజ్జ వదిలేసి వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శిస్తూ… ఉక్కు పరిశ్రమపై నేడు వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ… నేరం బాబుదే అనే కంక్లూజన్ ఇచ్చారు! అనంతరం.. ఆ కర్మాగారం కడపకు తెచ్చే బాధ్యత తమదే అని ఆశలు రేపుతున్నారు కన్నా!

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం.. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సాధ్యసాధ్యాలు పరిశీలించమని రాష్ట్ర అధికారులకు ఆదేశాలిస్తే… అందుకు సమాధానంగా, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చిందని చెబుతున్నారు కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్ర ప్రభుత్వం, మెకాన్ సంస్థ రెండు కలిపి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యసాధ్యాల నివేదిక వీలైనంత తవరగా కేంద్రానికి అందజేస్తే.. కేంద్రం ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని కన్నా చెబుతున్నారు. తాజా ఆర్డర్‌ ను తప్పుగా అర్థం చేసుకున్న కొందరు.. కావాలని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారాయన.

సుప్రీం కోర్టు కూడా ప్లాంట్ సాధ్యపడదని చెప్పలేదని చెబుతున్న కన్నా… స్టీల్ ప్లాంట్ కోసం ఎవరూ ఎలాంటి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని.. సీఎం రమేష్ దీక్షకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ చేస్తున్న ప్రచారాలపై స్పందిస్తూ… తెలుగుదేశం నేతలు చేస్తున్న డ్రామాలు ఇకనైనా ఆపాలని, సిగ్గు విడిచి నిర్లజ్జగా టీడీపీ ప్రభుత్వం ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తోందని దుయ్యబడుతున్నారు.

ఏది ఏమైనా… ఉక్కు కర్మాగారంపై తాజాగా వెలువడుతున్న విషయాలపై అప్పుడే బాబు.. దీక్షలూ, ధర్నాలు అంటూ నేరం మొత్తం కేంద్రానిదే అనే సూచనలు ప్రజల్లోకి పంపే కార్యక్రమానికి తెరలేపే లోపే… కన్నా లక్ష్మీనారాయణ ఈ విషయాలపై క్లారిటీ ఇవ్వడంతో బాబు కాస్త ఇరుకున పడినట్లయ్యిందని అంటున్నారు విశ్లేషకులు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చిందని కన్నా చెబుతున్న విషయాలపై టీడీపీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందనేది పలువురి అభిప్రాయపంగా ఉంది!!