Home రాజకీయాలు జపాన్ తరహా వద్దు.. రోడ్లెక్కండి!

జపాన్ తరహా వద్దు.. రోడ్లెక్కండి!

401
SHARE

రాష్ట్రంలో ప్రజలంతా కేంద్రం వైఖరికి నిరసనగా దీక్షలు చేయాలి.. కార్యకర్తలంతా ర్యాలీలు తీయాలి, నాయకులంతా ప్రజలతో ధర్నాలు చేయాలి.. అని పిలుపునిస్తున్నారు చంద్రబాబు! అదేంటి… చంద్రబాబు ఏమిటి ఇలా మాట్లాడటం ఏమిటి? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు అన్నీ జపాన్ తరహా దీక్షలు చేయాలని చెప్పుకున్న బాబు ఇలా మాట్లాడటం ఏమిటి? కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తే.. ఆర్టీసికి కోట్ల రూపాయల నష్టం వచ్చిందని.. ధర్నాల వల్ల రాష్ట్రానికే నష్టం అని, ర్యాలీల వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పుకొచ్చారు కదా అని ఎవరైనా అమాయకంగా పశ్నించుకుంటే… అది ప్రతిపక్షాలకు మాత్రమే అని గ్రహించుకోవాలి మరి!

విషయానికొస్తే… తాజాగా కడప ఉక్కు కార్మాగారం ఏర్పాటు చేయడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయం ఇప్పుడే కొత్తగా చెప్పిందేమీ కాదు.. సుమారు మూడున్నరేళ్ల క్రితమే కేంద్రం ఈ విషయం స్పష్టంగా చెప్పింది. ఈ సందర్భంగా విభజన చట్టంలో ఏముందో న్యాయస్థానానికి తెలిపిన కేంద్రం… కర్మాగారాల విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మాత్రమే విభజన చట్టంలో ఉందని.. సాధ్యం కాదన్న విషయం మొదటి ఆరునెలల తర్వాతే చెప్పేశామని పేర్కొంది. అయితే… ఈ విషయాలపై అప్పట్లో చప్పుడు చేయని చంద్రబాబు… ఇప్పుడు ఉక్కు కార్మాగారాలు ఇవ్వకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని.. దానికి నిరసనగా కార్యకర్తలు ర్యాలీలు తీయాలని, ధర్నాలు చేయాలని పిలుపునిస్తున్నారు.

ఈ సమయంలో కూడా జపాన్ తరహా నిరసనలు తెలిపితే బాగుంటుందేమో అని బాబు ఒకసారి ఆలోచించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. సరేలే… బాబు అప్పుడు ఏదో అలా అన్నారు కానీ ఇప్పుడు మారారులే అనుకుంటే మాత్రం పొరపాటు అనేది మరో విశ్లేషణగా ఉంది! ఇప్పటికే తన నేరాలు, కేంద్రం నేరాలు అన్నీ కలిపి.. ప్రత్యేక హోదా పేరుచెప్పి.. నేరాలు మొత్తం కేంద్రంపై వేసేస్తున్నారు చంద్రబాబు! ఈ సమయంలో ఆయనకు మరో అవకాశం వచ్చినట్లయ్యింది.. ఆయన ప్రసంగంలో, ఆయన విమర్శల్లో మరో అంశం యాడ్ అయ్యింది తప్ప… ఇది బాబులో వచ్చిన మార్పు కాదనేది మరికొందరి వాదన! దీంతో… బాబుకు ఇంతకాళం ఉన్న రెండు కళ్ల సిద్ధాంతానికి, రెండు నాలుకల సిద్ధాంతం మరింత బలంగా తోడయ్యిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి!!