Home రాజకీయాలు దొంగలు పడ్డ ఆరునెలలకు టీడీపీ నేతలు…!

దొంగలు పడ్డ ఆరునెలలకు టీడీపీ నేతలు…!

306
SHARE

వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మించడం లేదన్న విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లుగా, అన్నీ తెలిసి, అంతా చేసి, ఇప్పుడే ఈ విషయం తెలిసిందన్నట్లుగా.. ఇప్పుడు రంకెలేస్తున్నారు టీడీపీ నాయకులు అని ఆరోపిస్తున్నారు వైకాపా నేత అంబటి రాంబాబు! ఈ విషయాలపై సోమి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి… వైకాపా అధినేత జగన్ పై చేసిన విమర్శలకు సమాధానాలు చెప్పే క్రమంలో.. వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు అంబటి!

వైఎస్సార్‌ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మించకపోవడం అన్యాయమని.. అటు మోడీ, ఇటు చంద్రబాబు కలిసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని మొదలు పెట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అంబటి రాంబాబు… తెలుగుదేశం పార్టీ నేతలు ఇపుడు గగ్గోలు పెడుతున్నారు కానీ.. నాలుగేళ్లు కేంద్రంతో కలిసి ఉన్నపుడు ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు! అంతా జరిగిపోయి, బీజేపీతో కలిసి రాష్ట్రానికి చేయాల్సిన అన్యాయం అంతా చేసి.. ఇప్పుడు టీడీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని అంబటి ఫైరవుతున్నారు.

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే.. కడపలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కేంద్రం చెప్పిన విషయాన్ని గుర్తుచేసిన అంబటి… నాడు ఎన్డీయేలో భాగస్వామిగా టీడీపీ ఉంది కాబట్టి.. మౌనంగా ఉండి, జరుగుతున్న అన్యాయంపై నోరు మెదపలేని విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఆరునెలల్లో ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపడుతామని.. ఆ మేరకు విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌ లో ఆ విషయం ఉందని తెలిపిన అంబటి… దొంగలు పడ్డ ఆరునెలలకు టీడీపీ నేతలు మొరుగుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా విభజన హామీలపై చివరిదాకా పోరాడేది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే అని స్పష్టం చేసిన ఆయన.. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు టీడీపీ దీక్షల డ్రామాలాడుతోందని అభిప్రాయపడ్డారు.

నిజం చెప్పుకోవాలంటే… కడపకు ఉక్కు పరిశ్రమ రాదన్న విషయం చంద్రబాబు అండ్ కో కు మూడున్నర సంవత్సరాల క్రితమే తెలుసు. అప్పట్లోనే ఇది సాధ్యం కాదని SAIL (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ప్రకటించింది. ఈ విషయాలపై అప్పట్లో వైకాపా నేతలు గగ్గోలు పెట్టినా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే… అప్పుడు చంద్రబాబు మంత్రులు కూడా కేంద్రంలో ఉన్నారు. అయినా కూడా చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు బీజేపీకి టీడీపీకి చెడిన అనంతరం… ఈ విషయం కొత్తగా తెలిసినట్లు, ఈ విషయాలపై జగన్ స్పందించడం లేదని.. తాము మాత్రం ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని ప్రజలను మభ్యపెట్టే పనికి పూనుకుంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే… మోడీ మైత్రి మైకంలో.. తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కొసం రాష్ట్రానికి చంద్రబాబు చేసిన అన్యాయాల్లో మరొక అంశం ప్రజల్లోకి వచ్చిందని అనుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు!!