Home రాజకీయాలు ఈ జనం.. నిజం: తూర్పు చెప్పే భవిష్యత్తు!

ఈ జనం.. నిజం: తూర్పు చెప్పే భవిష్యత్తు!

SHARE

వైకాపా అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర అత్యంత ఘనంగా తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన ప్రతీ సంఘటనా చారిత్రక ఘట్టాలే అనేది అందరూ చెబుతున్న మాట. అంత హడావిడి జరిగింది, ఇంతహడావిడి జరిగింది అనేది జగన్ అభిమానులు చెబుతున్న మాట. అసలు ఆ టాపిక్కే ఎత్తకుండా.. కేవలం రాజండ్రిలో ఎదో చిన్న మీటింగు జరిగింది, పది మంది జనం వచ్చారు అన్నట్లుగా పసుపు మీడియా ఆత్మవంచన చేసుకుంటుంది. అభిమానులు, శత్రువుల సంగతి కాసేపు పక్కన పెడితే… అసలు ఈ జనం ఎలా వచ్చారు.. ఎందుకు వచ్చారు.. ఈ జన ప్రవాహం రాక, దేనికి సంకేతం? అనే విషయాలు పరిశీలిద్దాం!

2014 సార్వత్రిక ఎన్నికల్లో అటు పశ్చిమ గోదావరి, ఇటు తూర్పుగోదావరి జిల్లాల్లో జగన్ వైపు చూసినవారు లేరన్న అతిశయోక్తి కాదేమో! ఎందుకంటే… ఓట్ల రాజకీయంలో, ప్రజాస్వామ్య ఎన్నికల్లో… ఎప్పుడూ సీట్లు లెక్కే కాని, ఓట్లు ప్రాతిపదిక కాదు! ఒక్క ఓటుతో తేడా వచ్చినా… ప్రజా మద్దతు గెలిచిన వ్యక్తివైపు ఉన్నట్లే! ఆ లెక్కన చుసుకుంటే… తూర్పుగోదావరి జిల్లాలో జగన్ కు గత ఎన్నికల్లో వచ్చింది ఏమీ లేదు!! అంతా అధికారపక్షం, దాని పాత మిత్రపక్షం బీజేపీ నాయకులే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచారు. ఈ క్రమంలో చంద్రబాబు పాలనలో నాలుగేళ్లు గడిచిపోయాయి. పాలన అద్భుతః అని బాబు తెగ డప్పు కొట్టేసుకుంటున్నారు. మరి ఈ జనం ఎందుకు వచ్చారు?

దాదాపు మూడున్నర కిలోమీటర్ల మేర రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జి విస్తరించి వుంటే, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు జనాలు, జెండాల్తో నిండిపోయింది. కోట్లు ఖర్చు చేస్తే జనాల్ని రప్పించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ, ఇసుకేస్తే రాలనంత జనం.. జనసంద్రాన్ని తలపించేంతటి జన సమూహం కనిపించడం అంత ఆషామాషీ విషయం కానే కాదు. ఎందుకంటే… ఆ ప్రాంతంలో ఈ పార్టీకి అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు! అంటే… ఈ జనాలు, తరలించిన జనాలు కాదు. పోనీ వచ్చింది అధికారపక్ష నేతలు కాబట్టి… అర్జీలు పెట్టుకోవచ్చు, సమస్యలు తక్షణం పరిష్కరించుకోవచ్చు అంటే.. వచ్చింది ప్రతిపక్ష నేత! ఆయనకు ఎన్ని సమస్యల గురించి చెప్పినా… ఇంకో ఏడాది వరకూ ఏమీ చేయలేని పరిస్థితి. అయినా కూడా జనం ఎందుకు వచ్చారు?

ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం… భవిష్యత్తుపై ఆశ! గత ఎన్నికల్లో సీనియారిటీని చూసి చంద్రబాబుని నమ్మి ఓట్లేసిన జానాలకు, ఈ నాలుగేళ్ల పాలనలో బాబు చూపించిన సినిమాలు అన్నీ ఇన్నీ కాదు! ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం కూడా లొసుగులు లేకుండా, కండిషన్స్ లేకుండా అమలైన దాఖలాలు లేవు!! వంచనకు గురైన జనం.. ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న రోజులివి.. ఆ సమయంలో ఒక యువనేత “నేనున్నాను” అంటూ వచ్చి నిలిచున్నారు. మీకోసం నడుస్తాను, మీ అందరి సమస్యలు తెలుసుకుని, పరిష్కారాలు కనుక్కుంటాను అంటూ వస్తుంటే… ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో వంచనకు గురై, సుపరిపాలన అందించే నాయకుడికోసం చూస్తున్న ప్రజలను ఎవరు తరలించాలి.. రండి రండి అని ఎవరు బస్సులూ, లారీలు ఏర్పాటు చేయాలి? అవసరం లేదు… జనాలకు అన్నీ తెలుసు! రాజకీయ చైతన్యం పుష్కలంగా కలిగిన తూర్పుగోదావరి జిల్లా చెప్పే భవిష్యత్తు ఇదే! వంచన లేని రాజకీయం, అసత్యాల హామీలతో పబ్బం గడిపే నాయకత్వం వద్దని.. నమ్మకమైన ప్రజా పాలన జనాలు కోరుకుంటున్నారని!!