Home రాజకీయాలు ఉచ్ఛనీచాలు మరుస్తున్న టీడీపీ నేతలు!

ఉచ్ఛనీచాలు మరుస్తున్న టీడీపీ నేతలు!

SHARE

రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు అత్యంత సహజం! రాజకీయాల్లో విషయాలపైనా, సమస్యలపైనా, పరిష్కారాలపైనా మాటల యుద్దాలూ సహజమే! అయితే.. అవి వ్యక్తిగత విమర్శలకు దారితీస్తున్న దిగజారుడు రాజకీయాలు రాష్ట్రంలో రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా విమర్శించాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా… వాటిలో కూడా కాస్త ఆచి తూచి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విషయం మరిచిన కొందరు నేతలు.. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మొదలుపెడుతున్నారు. ఆ మాటలు విన్నవారంతా… ఇది అన్నం తినే వారు మాట్లాడాల్సిన మాటలేనా అని కామెంట్స్ చేస్తున్నా… అవి వారికి పట్టడం లేదు. ఎవరు ఏమనుకుంటే మాకేంటి.. అన్ పార్లమెంటరీ వర్డ్స్ అనుకుంటే మాత్రమేమి? అనే సంస్కారం మరిచి.. సంస్కార హీనులకు తామే కేరాఫ్ అడ్రస్ అన్న చందంగా మాట్లాడుతున్నారు! ఈ విషయంలో తాజాగా టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఉచ్ఛనీచాలు మరిచి మాట్లాడుతున్నారనే కామెంట్స్ ని మూటగట్టుకున్నారు!

నిన్న మొన్నటివరకూ జేసీ బ్రదర్స్ పై ఇలాంటి విమర్శలే వచ్చేవి! తల్లి చెల్లి అనే తేడాలేకుండా.. తమ వ్యక్తిగత, రాజకీయ గొడవల్లోకి ఇంట్లో మహిళలను సైతం ఉచ్చరిస్తూ విమర్శలు చేసిన వైనాన్నికి జేసీ సోదరులు గతంలో తెరలేపారు. సభ్యసమాజం తలదించుకునేలా, మీడియా సైతం ప్రచురించలేని, ప్రసారం చేయలేని విధంగా ప్రసంగాలు చేశారు. ఇప్పుడు తనవంతు వచ్చిందని మొదలుపెట్టారు మురళీమోహన్! పాదయాత్రలో భాగంగా రాజమండ్రిలో ప్రసంగించిన జగన్… “గోదావరికి అవతల వైపు.. మంత్రి జవహార్ గారు, శేషారావు గారూ ఇసుకను లూటీ చేస్తుంటే… గోదావరికి ఇటుసైడు ఒక ముసలాయన, ఆయన పేరు బుచ్చయ్య చౌదరి.. ఆయనకు తోడు ఒక ఎంపీ మురళీ మోహన్ కలిసి.. వీరిద్దరూ బాధ్యతగల స్థానంలో ఉండి ఇస్తుకను దోచి పెడుతున్నారని విమర్శించారు”. ఇది చాలా హుందా అయిన రాజకీయ విమర్శ! కాసేపు వాస్తవాలు మాట్లాడుకోవాలంటే.. గోదావరి జిల్లా ప్రజలను అడిగితే.. జగన్ మాటల్లో వాస్తవాలు వారే చెబుతారు!

ఈ హుందా అయిన రాజకీయ విమర్శలకు స్పందించిన మురళీమోహన్… వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లక్షల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. అంతవరకూ బాగానే ఉంది! అదే నిజమైతే.. వారి ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు అయ్యింది, పైసా కూడా నిరూపించలేకపోయారేమి? అనే ప్రశ్నకు సమాధానం సంగతి తర్వాత చూద్దాం! సరే.. అక్కడితో ఆగని మురళీమోహన్… జగన్‌ సీఎం అయితే రాష్ట్రాన్నే అమ్మేస్తారని అన్నారు. అది కూడా రాజకీయ విమర్శే అని సర్ధుకునేలోపు… జగన్ జన్మే నీచమైనదని అని పిచ్చి వ్యాఖ్య చేశారు మురళీమోహన్! దీంతో సోషల్ మీడియా వేదికగా… మురళీమోహన్ పై విమర్శల వర్షాలు కురుస్తున్నాయి. ఉచ్చనీచాలు మరిచి మాట్లాడుతున్న తెలుగుదేశం నేతలకు ఏమి పోయేకాలం వచ్చింది అని విమర్శిస్తున్నారు ప్రజలు!!