Home రాజకీయాలు ట్రంప్ – కిమ్‌.. కలయికను వాడేసిన బాబు!

ట్రంప్ – కిమ్‌.. కలయికను వాడేసిన బాబు!

SHARE

ప్రపంచంలో ఏ గొప్ప విషయం జరిగినా, ఏ మంచి విషయం జరిగినా… ఆ విషయంలో తన పాత్ర ఉందని, అదంతా తన క్రెడిట్టే అని చెప్పుకునే బాబు, అది వీలుకానప్పుడు.. ఆ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం దిట్ట! ఆఖరికి సింధూ కి ఒలెంపిక్స్ లో పథకం వచ్చినా కూడా అది తన క్రెడిట్టే అని చెప్పుకోగల చంద్రబాబు… ట్రంప్ – కిమ్‌ ల కలయికను, వారి శిఖరాగ్ర సమావేశాన్ని మాత్రం ఎందుకు వదులుకుంటారు? నో ఛాన్స్… వదిలే ప్రసక్తి లేదు.

తాజాగా ప్రపంచంలో అత్యంత వివాదాస్పద నాయకులైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ కలుసుకుని సామరస్య పూర్వకంగా మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై యావత్ ప్రపంచం హర్షం వ్యక్తం చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు అమెరికా మీడియా మాత్రం… కిమ్‌ గెలిచారు.. ట్రంప్ ఓడారు అంటూ ప్రకటిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే… వీరిరువురూ తమ శిఖరాగ్ర సమావేశానికి సింగపూర్‌ ని వేదికగా ఎంచుకున్నారు. దీంతో ఆ విషయం తెలుసుకున్న అమెరికన్లతో పాటు ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు… అసలు ఈ సింగపూర్ ఎక్కడ ఉంది? అది అసలు దేశమేనా? సింగపూర్ – ఉత్తర కొరియాకు సంబంధం ఏంటి? అని గూగుల్ లో వెతికినట్లు గూగుల్ ట్రెండ్స్ తేటతెల్లం చేస్తున్నాయి.

ఆ సంగతులు అలా ఉంటుంటే… ఇద్దరు అగ్రనేతలకు ఆతిథ్యమిస్తొందంటే సింగపూర్‌ ఎంత గొప్పదో అర్ధం చేసుకోండి.. ఆ దేశ గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి అని మైకందుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు! సింగపూర్ కు పర్యాటక శాఖ మంత్రి బాధ్యతలు తీసుకున్న రేంజ్ లో ఆ దేశం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు… ట్రంప్‌, కిమ్‌ కి సింగపూర్‌ పై ఎంత నమ్మకం ఉంటే.. ఆ పని చేస్తారని చెప్పుకొస్తున్నారు! వారిరువురికి సింగపూర్ పై నమ్మకం ఉంటే, సింగపూర్‌ కేమో ఆంధ్రప్రదేశ్‌ పై నమ్మకం ఉంది.. అని ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా అలా మార్చేసుకుని… సింగపూర్ పైనా, అమారవతిపై పెత్తనం వారికి ఇవ్వడంపైనా ఏపీ వాసులకు ఎలాంటి భయం అవసరం లేదు అనే విషయాన్ని చెప్పడానికి తెగ తాపత్రయపడిపోతూ, అందుకు ఈ భేటీని అలా వాడేస్తున్నారు చంద్రబాబు!

రేపొద్దున్న వీరు కానీ, మరో ఇద్దరు పెద్ద దేశాల అధినేతలు కాని.. ఏ పాకిస్తాన్ లోనో భేటీ పెట్టుకుంటే.. ఏపీ పరిస్థితి, అమరావతి పరిస్థితి ఏమిటో అని ఈ సందర్భంగా సెటైర్లు పడుతున్నాయి!!