Home రాజకీయాలు అమరావతి అడ్రస్ మారిపోతుందా?

అమరావతి అడ్రస్ మారిపోతుందా?

SHARE

ఏపీలో చంద్రబాబు చేస్తున్న పనులు రోజు రోజుకీ విమర్శల పాలవుతూనే ఉన్నాయి. తాను అంత సీనియర్, ఇంత సీనియర్ అని చెప్పుకుని గడుపుతున్న చంద్రబాబు… చేస్తున్న పనులు ఆలోచించి చేస్తున్నారా లేక అజ్ఞానంతో చేస్తున్నారా అనే అనుమానాలు మేధావులతో పాటు సామాన్యులూ వ్యక్తపరుస్తున్న పరిస్థితులు నేడు రాష్ట్రంలో నెలకొన్నాయి. అందుకు తాజా ఉదాహరణ… జూన్ 7వ తేదీన సింగపూర్ అధికారులు, కాంట్రాక్టర్లతో బాబు చేసిన పని! పెద్దమనసుతో భూములిచ్చిన రైతుల భూములు.. తన సొంత ఆస్తులన్న రేంజ్ లో బాబు సాగించిన వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తడంతో పాటు.. సామాన్యులను, భవిష్యత్ గురించి ఆలోచించేవారిని భయబ్రాంతులకు గురిచేశాయి. తాజాగా ఇదే విషయాలపై స్పందించారు ముద్రగడ పద్మనాభం!

ఇంతకాలం అమరావతి అంటే.. అది పూర్తవుతుందన్న నమ్మకం ఉన్నవాళ్లు, లేనివాళ్లు కూడా.. అది ఏపీ రాజధాని అని చెప్పుకునేవారు! అయితే… తాజాగా నేలకొంటున్న పరిస్థితుల నేపథ్యంలో.. అమరావతి అంటే.. సింగపూరు పాలిత ప్రాంతం అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంపై భయాందోళనలు వ్యక్తపరిచిన ముద్రగడ… టీడీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలకూ ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ప్రత్యేకించి… వైకాపా అధినేత జగన్ – పవన్ లు కలిసి.. మిగిలిన పక్షాలను కలుపుకుంటూ ఒక వేదిక ఏర్పాటుచేసి పోరాడాలని పిలుపునిస్తున్నారు.

ప్రజల ఆస్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత ఆస్తులుగా భావించి, సింగపూర్‌ కంపెనీలకు దానం చేస్తున్నారని ధ్వజమెత్తిన ముద్రగడ… జగన్, పవన్ అన్ని పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఈ విషయమై చర్చించాలని.. అంతా కలిసి రాష్ట్రాన్ని, రైతులను, సామాన్య ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరముందని హితవు పలికారు. ఇదే క్రమంలో… ఈ పోరాటం ఏ రేంజ్ లో ఉండాలో చెప్పిన ముద్రగడ… బ్రిటీష్ వారిని మన దేశం నుండి ఎలా తరిమికొట్టామో అలాగే సింగపూర్ కంపెనీని తరిమి కొట్టాలని కోరుతూ.. సమస్య తీవ్రతను చెబుతున్నారు.

ప్రతీ విషయాన్ని రాజకీయ కోణంలో చూడని పక్షంలో.. ముద్రగడ కోరికలో న్యాయం ఉందనేది పలువురి అభిప్రాయంగా ఉంది. ఇక అమరావతి విషయంలో జరుగుతున్న ఒప్పందాలు.. మార్చుకుంటున్న ఎం.ఓ.యూ. లలో ఏమి ఉందనే విషయంపై ప్రజలకు పూర్తి క్లారిటీ ఇచ్చేవారు కరువైన పరిస్థితి. బాబు తనకున్న సొంత తెలివి తేటలతో రాష్ట్రాన్ని అదోగతి పాలుచేస్తున్నారా.. సింగపూరు మాయలో పడి, వ్యక్తిగత వ్యాపారాభివృద్ధి కోసమో, సింగపూరు వ్యాపారాల కోసమో కావాలనే రాష్ట్రాన్ని ఇలా సింగపూర్ పాలు చేస్తున్నారా అనే అనుమానాలు సామాన్యులు సైతం వ్యక్తం చేస్తున్నారు!! పరిస్థితులు ఇలానే ఉంటే మాత్రం… కచ్చితంగా అమరావతి అడ్రస్ మారిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు!!