Home రాజకీయాలు పోలవరం పేరు చెప్పి బ్లాక్ మెయిలా బాబు?

పోలవరం పేరు చెప్పి బ్లాక్ మెయిలా బాబు?

SHARE

ఎన్నికలు సమీపిస్తున్నాయనే సంకేతాల నడుమ.. చంరబాబు నాయుడు ఓటర్లను ప్రలోభపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మాయ మాటలు అనో, నెరవేర్చని హామీలు నరవేర్చామనో.. ఇలా అన్నీ చెప్పుకుంటున్నారు. అయినా ప్రజలు నమ్మే పరిస్థితులో లేరని గ్రహించారో ఏమో కానీ… రాబోయే ఎన్నికల్లో కూడా తాను గెలిస్తేనే… అమరావతి, పోలవరం పూర్తవడమే కాదు.. అనుకున్నవన్నీ జరుగుతాయని ప్రఓక్ష బెదిరింపు ధోరణికి దిగుతున్నారు! ఈ క్రమంలో తాము తప్ప మరెవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని నోరు జారిన బాబు… తాజాగా పోలవరం పూర్తయ్యే డేట్ మార్చేశారు. దీనిద్వారా బాబు సమర్ధత ఇంతే అని చెప్పదలచుకున్నారా లేక.. వాస్తవాలు తెలియని కొంతమంది ప్రజలైనా.. బాబు రాకపోతే పోలవరం పూర్తవదేమో అనే భయంతో అయినా నాలుగు ఓట్లేస్తారని భావిస్తున్నారో తెలియదు కానీ… అలాంటి పనికే పూనుకున్నారు చంద్రబాబు!

జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఏపీ సశ్యశ్యామలమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. సుమారుగా 7 లక్షల ఎకరాలకు పైగా సాగు నీటితో పాటు పలు జిల్లాలకు తాగు నీటిని అందించడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన మేరకు నీటిని అందించడం ఈ ప్రాజెక్టు వల్ల సాధ్యమవుతుంది! రాష్ట్రవిభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించేందుకు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రాజెక్టును తామే నిర్మించి ఇస్తామని కూడా కేంద్రం చెప్పింది. అయితే సొంత మనుషులకు ప్రయోజనం చేకూర్చేందుకు అన్నట్లుగా చంద్రబాబునాయుడు… నిధులిస్తే చాలు – ప్రాజెక్టును మేమే కట్టుకుంటామంటూ మొదలెట్టారు. దీంతో బీజేపీతో పొత్తు కారణంగా కేంద్రం నుంచి కూడా తనకు అనుకూలంగానే నిర్ణయం వచ్చేలా చేసుకున్నారు. ప్రాజెక్టు చేతికి వచ్చింది.. కాని పని.. అనుకున్న సమయానికి పూర్తవుతుందా?

ఈ క్రమంలో తొలుత… ప్రతి సొమవారం పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తానని 2018 ప్రథమార్థం నాటికే పోలవరాన్ని పూర్తి చేసి తీరతామని చెప్పిన సంగతి తెలిసిందే. అనంతరం 2018 రెండు మూడు నెలలు గడిచే టైంకి… తూచ్ తూచ్… 2018 చివరినాటికి అని చెప్పుకొచ్చారు. సరేలే… అనుకున్న జనాలకు మరోషాక్ ఇచ్చారు చంద్రబాబు. 2019 డిసెంబర్ నాటికి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని.. ఎన్ని అడ్డంకులు పెట్టినా 2019 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు ప్రకటించారు. సరిగ్గా గమనిస్తే అసలు లాజిక్ ఇక్కడే ఉంది!

2019 డిసెంబర్ నాటికి కూడా చంద్రబాబే సీఎంగా ఉంటారా? ప్రస్తుత ఐదేళ్ల టెర్మ్ వచ్చే ఏడాది మేతో ముగియనుంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ గెలిస్తేనే… చంద్రబాబు సీఎం అవుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావడం దాదాపుగా అసాధ్యమనే సంకేతాలు ప్రజానాడి, సర్వేల ద్వారా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలవరం గడువును 2019 డిసెంబర్ నాటికి పెంచడం ద్వారా… పోలవరం పూర్తి కావాలంటే మరోమారు తనకు ఓటేయాలని ప్రజలను బాబు మభ్యపెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.

ఇక్కడ బాబు గమనించాల్సిందేమిటంటే… పోలవరం అనేది రాష్ట్రప్రభుత్వ బాధ్యత. ఇది చంద్రబాబు బాధ్యత కాదు! వ్యవస్థాగత కార్యక్రమాన్ని.. వ్యక్తిగత ప్రతిషటగా, వ్యక్తిగత కార్యక్రమంగా చెప్పుకుని జనాలను ఏమార్చేపనికి పూనుకుంటున్నారు చంద్రబాబు. రాబోయే కాలంలో చంద్రబాబు సీఎం కాకపోయినా… అన్నీ అనుకూలంగా జరిగితే పోలవరం పూర్తవుతుంది.. ఇది జనాలకు తెలుసన్న విషయం బాబుకు తెలుసుకోలేకపోవడమే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం!