Home రాజకీయాలు రాజారెడ్డి హంతకుడి విడుదల వెనక…!

రాజారెడ్డి హంతకుడి విడుదల వెనక…!

653
SHARE

ప్రభుత్వాలు ఖైదీలకు పెట్టే క్షమాభిక్షలో కూడా రాజకీయాలు పెరిగిపోతున్నాయా? ఈ విషయంలో కూడా రాజకీయ పార్టీల మద్దతుదారులు, శత్రువుల శత్రువులు మిత్రులు, వంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నారా? లేక.. రాజకీయంగా ఎదుర్కొన లేక.. రాజకీయ ప్రత్యర్ధులను భయబ్రాంతులకు గురిచేసే చర్యలకు పాల్పడటంలో భాగంగా చేస్తున్నారా? తాజాగా జరిగిన ఒక సంఘటన ఈ అనుమానాలు రేకెత్తిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దానికి దారితీసిన సంఘటన… దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్నా వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాబిక్ష పేరిట విడుదల చేయడం!

అవును… రాజశేఖర్‌రెడ్డి తండ్రి వైఎస్‌ రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకర్‌ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష పేరిట విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాజాగా అమలు చేసింది. కాగా… ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్ల వల్లే రాజారెడ్డి హత్యకేసులో నిందితుడైన రాగిపిండి సుధాకర్‌ రెడ్డిని విడుదల చేసినట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం వేల్పుల గ్రామానికి చెందిన సుధాకర్‌ రెడ్డి 1998లో జరిగిన రాజారెడ్డి హత్యకేసులో నిందితుడు. ఈ హత్యకేసులోని నిందితులందరికీ న్యాయస్థానం 2006లో జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి నెల్లూరు జిల్లాలోని కారాగారంలో జైలు జీవితం గడుపుతున్న సుధాకర్‌ రెడ్డిని విడుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై కొందరు టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాగా… రాష్ట్రంలోని పలు జైళ్ల నుంచి మొత్తం 47 మంది ఖైదీలు విడుదలవగా… వారిలో రాజమండ్రి నుంచి 18 మందికి, విశాఖ నుంచి 13 మందికి, అనంతపురం నుంచి ఆరుగురు, వైఎస్సార్‌ జిల్లాలో ఏడుగురు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు ఖైదీలకు క్షమాభిక్ష లభించింది. వీరిలో కొందరు ఆదివారం విడుదల కాగా.. మరికొందరు సోమవారం విడుదల కానున్నారు.