Home రాజకీయాలు కన్నా ఫైర్… డోసు పెంచుతున్నారుగా!

కన్నా ఫైర్… డోసు పెంచుతున్నారుగా!

358
SHARE

ఇంతకాలం ఏపీ బీజేపీలో ట్రంప్ కార్డు ఎవరంటే అంతా చెప్పే మాట.. సోము వీర్రాజు అని! అయితే.. పార్టీ బాధ్యతలు కన్నాకు అప్పగించిన సమయంలో కాస్త కినుక వహించిన సోము.. అనంతరం మేలుకుని బాబుపై ఫైరవుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచీ బాబుబై భారీస్థాయిలో విరుచుకుపడని కన్నా లక్ష్మీనారాయణ… తాజాగా నిప్పుల వర్షాలు కురిపించారు. బాబు జీవితం మొత్తం ఇదని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏ రేంజ్ లో ఫైరయ్యారో ఇప్పుడు చూద్దాం!

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రధానిపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అమరావతి ధర్నాచౌక్ లో భారతీయ జనతా పార్టీ నేతలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మైకందుకున్న కన్నా లక్ష్మీనారాయణ… రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని.. పోలీసులను ఉపయోగించుకుని ముఖ్యమంత్రి తన ప్రత్యర్ధులపై దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీలో చేరకపోతే కేసులు బెడతామంటూ పోలీసులతో బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ మోసం చేయలేదని, కుట్ర రాజకీయాలతో చంద్రబాబే రాష్ట్ర ప్రజలను మోసం చేశారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఇప్పటికే అవినీతి, అక్రమ పాలన కొనసాగిస్తున్న చంద్రబాబుకు మరోసారి అవకాశమిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని దుయ్యబట్టారు. అంతవరకూ ఓ మోస్తరు విమర్శలు చేసిన అనంతరం వ్యక్తిగతంగా నిప్పులు చెరిగారు కన్నా.

మోసానికి ప్రతిరూపమే చంద్రబాబని.. రాష్ట్రాన్ని మోసం చేసింది బీజేపీ కాదని, చంద్రబాబే పెద్ద మోసగాడని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. 2014 నుంచి ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉండి సాయం చేస్తున్న ప్రధాని మోడీని మోసగాడని దుష్ప్రచారం చేస్తున్నారని.. అన్నంపెట్టిన చేతులను నరకడం చంద్రబాబుకు అలవాటేనని కన్నా తూర్పారబట్టారు. చంద్రబాబు ఒక ద్రోహి అని, అవినీతి పరుడని నాడు ఎన్టీఆర్ కూడా చెప్పేవారని గుర్తుచేసుకున్న కన్నా లక్ష్మీనారాయణ.. చంద్రబాబుది పూర్తిగా చీకటి, కుట్ర చరిత్రని.. తమ కర్మ కొద్దీ టీడీపీతో నాలుగు సంవత్సరాలు కలిసి సాగామని తేల్చి చెప్పారు.

నిన్నటివరకూ ఒకవైపు జగన్, మరో వైపు పవన్, ఇంకోవైపు కమ్యునిస్టులు, కాంగ్రెస్ నేతలు… ఇలా విమర్శల వానలో తడిసి ముద్దవుతున్న చంద్రబాబుపై తాజాగా బీజేపీ పెంచిన దాడి చూస్తుంటే… బాబు చరిత్ర మొత్తం బహిర్గతమయ్యే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. గట్టిగా అరిచి, అనుకూల పత్రికల్లో రాయించినంత మాత్రాన్న చంద్రబాబు చెప్పే అబద్దాలనీ వాస్తవాలు అయిపోతాయా అని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు!