Home రాజకీయాలు మరి వీళ్లంతా ఎవరు బాబు?

మరి వీళ్లంతా ఎవరు బాబు?

SHARE

“రాష్ట్రంలో పాలన అద్భుతంగా ఉంది.. తాను ఈ నాలుగేళ్లలో చేసిన సంక్షేమం.. తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేనంత సంతృప్తిని ఇచ్చింది.. అన్ని వయసుల వారికీ, అన్ని దశల్లోనూ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం..” తాజాగా విలేకరుల సమావేశంలో ఏపీ ముఖయమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలివి. దానికి ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. అదేమిటంటే… “ప్రతి ఇంటికీ పెద్దకొడుకుగా ఉంటానన్న మాట మేరకు .. తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌, పౌష్టికాహారం, స్కాలర్‌షిప్‌, విదేశీ విద్యకు సాయం, పెళ్లి కానుక, ఫించను, చంద్రన్న బీమా.. ఒక వ్యక్తి జీవితంలో ఈ పథకాల కింద కవర్‌ కాకుండా ఎక్కడైనా ఉంటారా అని ఒక గ్రామంలో అడిగాను. అంతా 10 నిమిషాలు ఆలోచించారు. చివరకు ఒక ఒంటరి మహిళ.. అందరూ కవర్‌ అవుతున్నారు. కానీ భర్త వదిలేసిన మహిళలకు లబ్ధి చేకూరడం లేదని చెప్పారు. వెంటనే ఒంటరి మహిళలకూ పింఛను ఇచ్చేశాం” అని తెలిపారు.

ఇక్కడ గమనించాల్సింది ఏంఇటంటే… బాబు పెట్టిన పథకాలు పుట్టినప్పటినుంచి మరణించే వరకూ అన్నీ ప్రభుత్వం సాయం చేస్తుంది అని చెప్పడం. అలా అని పథకాలు ప్రవేశపెట్టినప్పుడు… ఆ పథకాల్లో కవర్ కాకుండా ఎవరు ఉంటారు? అయితే.. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. అవన్నీ సక్రమంగా అమలవుతున్నాయా.. ప్రజలందరికీ అమలవుతున్నాయా లేక తమ పార్టీ కార్యకర్తలకు మాత్రమే అమలు అవుతున్నాయా? అని! ఈ విషయాలను మరిచిన బాబు… ఐదుకోట్ల ఆంధ్రుల్లో ఒక మహిళ అడిగిందని వెంటనే ఇచ్చేశాము అని చెబుతున్నారు.. ఇది శాస్వత పరిష్కారమా? సీఎం దగ్గరకు రాని వాళ్లు ఇంకా ఎన్ని లక్షల్లో ఉండి ఉంటారు? ఈ విషయం మరిచిన బాబు.. పైన చెప్పిన సంఘటన చెప్పుకొచ్చారు.

ఇక వాస్తవాల్లోకి వస్తే… పాదయాత్రలో జనాల కష్టాలు, సమస్యలు తెలుసుకుంటున్న జగన్ వద్దకు వచ్చిన ముసలివాళ్లంతా చెబుతున్న మాట.. తమకు పించను సక్రమంగా అందడం లేదు అని. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జగన్ కు… పింఛన్‌ ఇవ్వడం లేదంటూ వృద్ధులు, వితంతువుల ఆవేదన వ్యక్తం చేస్తూ తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఇక దివ్యాంగుల సమస్యల గురించి ప్రత్యేకంగా ప్రస్థావించుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లాలోని చాగల్లు మండలంలో అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు రావడం లేదని సనమండ్ర వెంకటేశ్వరరావు అనే వ్యక్తి వాపోయారు. ఈ సందర్భంగా జగన్‌ ను కలిసి దివ్యాంగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఇది ఈ గ్రామనికో, పలానా వెంకటేశ్వర రావుకో పరిమితమైన సమస్య కాదు.. నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఇంతకాలం తర్వాత కూడా ఒక మహిళ నేరుగా ఎదురై… తనకు పింఛను లబ్ధి చేకూరడం లేదని చెప్పిందంటే.. పథకాల అమలు రాష్ట్రంలో ఏ పరిస్థితుల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ విషయాలు అన్నీ తెలిసి, అన్నీ తన కనుసన్నల్లోనే జరుగుతున్నా కూడా… అంతా బాగుంది, ఏపీ వెలిగిపోతుంది అంటూ ఆత్మవంచన చేసుకుంటున్న చంద్రబాబు… ఒక మహిళ దగ్గరకు వచ్చి సమస్య చెప్పుకోగానే.. ఆ సమస్య తీర్చాను అని గొప్పగా చెబుతున్నారే తప్ప.. ఇంకా ఇలాంటి వారు ఎందరున్నారు, వారి సమస్యలు ఎలా తెలిసేది.. నిజంగా అంతా బాగుండి ఉంటే.. జగన్ కు అన్ని అర్జీలు, వినతిపత్రాలు ఎందుకు వస్తాయి అని గ్రహించలేకపోవడం.. ఆత్మవంచన అనుకోవాలా లేక జనాలకు మసిపూసి మారెడు కాయను చేసి చూపించడం అనుకోవాలా?

ఇదంతా నా తప్పు కాదు.. అధికారుల తప్పు.. అని తప్పుకుంటారా? అలా అయితే అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది. ఇప్పటికే మోసపోయాను అని తన చేతకాని తనాన్ని బహిరంగంగా చెప్పుకుని తిరుగుతున్న చంద్రబాబు… తన అసమర్ధ పాలనను ఒప్పుకున్నట్లు అవుతుంది. ప్రభుత్వంలో భాగమైన అధికారులు సైతం బాబును మోసం చేస్తున్నట్లవుతుంది. అలాంటప్పుడు బాబు పూర్తిగా అసమర్ధుడు, చేతకానివారు అవుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు!