Home రాజకీయాలు ఈ ముగ్గురికీ మూడినట్లేనా?

ఈ ముగ్గురికీ మూడినట్లేనా?

SHARE

ప్రత్యేక హోదా కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆమరణ నిరాహారదీక్ష చేశారు వైకాపా ఎంపీలు! వారి అలుపెరగని పోరాటంలో భాగంగా.. కేంద్రం వైఖరికి నిరసనగా ఏప్రిల్ 6న తమ ఎంపీ పదవులకు రాజినామాలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవి మీడియా కవరేజ్ కోసం, పత్రికల్లో ప్రకటనల కోసం చేసిన రాజినామాలుగా మిగిలిపోకుండా… తమ రాజీనామాలు ఆమోదించాల్సిందిగా స్పీకర్ పై పదే పదే ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో వైసీపీ నేతల నిబద్ధతను చూసిన స్పీకర్ వారి రాజీనామాలను ఆమోదిస్తానని ప్రకటించారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న స్పీకర్ జూన్ 19న స్వదేశానికి రాగానే వాటిని ఆమోదించనున్నారు. ఈ క్రమంలో రాజినామాల అనంతరం లేక రాజినామాలతో పాటు… గోడదూకిన ముగ్గురు వైకాపా ఎంపీలపై అనర్హత వేటు వేయించడానికి ప్లాన్స్ వేస్తున్నారు వైకాపా ఎంపీలు!

వివరాళ్లోకి వెళ్తే… 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎన్నికల్లో గెలుపొంది, అనంతరం వ్యక్తిగత స్వార్ధ ప్రయోజనాలకోసం టీడీపీలో చేరారు వైకాపా ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, బుట్టా రేణుక! వీరి అనైతిక కార్యక్రమాలపై చర్యలు తీసుకోవడానికి సిద్దపడిన వైకాపా ఎంపీలు… వీరిని అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకర్ కు లేఖలు రాశారు. ఈ క్రమంలో ఆ ముగూరూ పార్టీ మారినట్లు ఆధారాలతో సహా స్పీకర్ కు లేఖలు సమర్పించారు. దీంతో ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత లు పార్టీ ఫిరాయింపులకు పాల్పడడాన్ని పరిశీలించిన పార్లమెంటరీ డిసిప్లనరీ కమిటీ వారి వ్యవహారాన్ని తప్పుపట్టిందని తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరిపై చర్యలకు స్పీకర్ కూడా సిద్ధమైనట్లు సమాచారం.

అయితే… రేణుకకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించాలని నిర్ణయించిన వైకాపా ఎంపీలు అనుకున్నపని సక్సెస్ ఫుల్ గా చేసి.. ఆమెపై కూడా పార్లమెంటరీ డిసిప్లనరీ కమిటీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారంట. దానికి సాక్ష్యాలుగా… రేణుక తాజాగా టీడీపీ మహానాడులో పాల్గొనడం, అక్కడ చేసిన హడావిడి.. తదితర వీడియోలను వైసీపీ నేతలు కమిటీకి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మాత్రం… చంద్రబాబుకు చెంపపెట్టులాంటి పని పూర్తయినట్లు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఒకవైపు ప్రత్యేక హోదాకోసం, విభజన హామీల అమలు కోసం అలుపెరగని పోరాటం చేసిన పేరు సంపాదించుకున్న వైకాపా ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదింపచేసుకోవడంతోపాటుగా.. గోడదూకిన రాజకీయ “గోపీ”లను అనర్హులుగా ప్రకటింపచేయగలిగితే మాత్రం ఇది ఏపీ రాజకీయాల్లో కీలకమైన అంశంగా మారబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా… ఏపీలో వైకాపా గుర్తుపై గెలిచి, నిస్సిగ్గుగా, అనైతికంగా సైకిల్ ఎక్కేసిన ఎమ్మెల్యేలపై కూడా ఏపీ అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోవాలనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఈ బలమైన కామెంట్స్.. చంద్రబాబుకి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెలకు కూడా వినిపించి, వారిలో చలనం రావాలని పలువురు కోరుకుంటున్నారు!!