Home రాజకీయాలు ముసుగు తీసిన పవన్ కు వర్తిస్తుందిగా!

ముసుగు తీసిన పవన్ కు వర్తిస్తుందిగా!

SHARE

వెనకా ముందూ చూసుకోకుండా 2014 సమయంలో చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీకి మద్దతు ఇచ్చారు పవన్ కల్యాణ్. వెనకా ముందూ అనే మాట ఇప్పుడెందుకు వచ్చిందంటే… తాజాగా పవన్ కల్యాణ్.. చంద్రబాబు తనను మోసం చేశారని చెప్పుకొస్తున్నారు కాబట్టి! ఆ సంగతులు అలా ఉంటే… గత ఎన్నికల సమయంలో పవన్ చెప్పిన మాట, చేసిన ప్రసంగం ఇప్పుడు తిరిగి తిరిగి పవన్ కే తగులుతుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైపోయింది.

విషయానికొస్తే… గత ఎన్నికల సమయంలోనే కాదు, నిన్న మొన్నటి వరకూ కూడా జనసేన అధిపతి పవన్ కల్యాణ్ చెప్పిన మాట “అనుభవం”. అవును.. పాలనకు ‘అనుభవం’ కావాలనే విషయం గురించి పవన్ అప్పట్లో తెగ మాట్లాడారు. నిన్న మొన్నటివరకూ కూడా చంద్రబాబుతో చెడక ముందు, చెడిన తర్వాత కూడా… 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇవ్వడానికి కారణం ఆయన అనుభవమే అని… ఇదే క్రమంలో జగన్ కు అనుభవం లేని కారణంగానే మద్దతు ఇవ్వలేదని చెప్పుకొచ్చేవారు. కాలం గడిచింది.. మరలా ఎన్నికలు వచ్చాయి.. పవన్ సొంతంగా అన్ని స్థానాల్లోనూ పోటీచేస్తానని ప్రకటించారు. అక్కడితో ఆగకుండా… రాబోయే కాలంలో ప్రజలు కోరుకుంటే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించేస్తున్నారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని అంటే.. ముఖ్యమంత్రి అవుతాననే విషయాన్ని పరోక్షంగా చెబుతున్న పవన్ కు, రాష్ట్రాన్ని పాలించడానికి ఉన్న అనుభవం ఏమిటి? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి! ఈ ప్రశ్నకు పవన్ గుటకలు మింగుతారా.. సమాధానం చెబుతారా అనేది వేచి చూడాలి! ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న జగన్ కు. రాష్ట్ర చరిత్రలో అత్యధిక మెజారిటీ వచ్చిన ఎంపీగా రికార్డులు సృష్టించిన జగన్ కు.. అనుభవం లేదని భావించిన పవన్… తన జీవితంలో మొట్టమొదటి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. ఆ లెక్కన చూసుకుంటే… పవన్ ఇప్పుడు అక్షరాభ్యాసం చేస్తున్నారు. అనంతరం 2019లో ప్రవేశ పరీక్ష రాయాలి. అది పాసవ్వాలి.. అనంతరం అసెంబ్లీలో కూర్చుని, నేర్చుకుని, ప్రజలకు ఒక ఎమ్మెల్యేగా సేవలందించి.. అనంతరం ముఖ్యమంత్రి స్థానం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాలి కదా! ఈ విషయంలో నాడు పవన్ చెప్పిన మాట వాస్తవమైతే.. ఇది కూడా కచ్చితంగా వాస్తవమే. ఈ థియరీ పవన్ కి కూడా వర్తిస్తుంది!!

కాగా… ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చాను కానీ, పదవుల కోసం కాదని గతంలో చెప్పిన పవన్.. 2014లోనే పోటీచేసి ఉంటే 5-10 స్థానాలు గెలిచేవారమని ప్రకటిస్తున్నారు. అంటే.. పవన్ కు ముందునుంచీ అధికార దాహం ఉంది కానీ, దానికి “ప్రశ్నించడానికి” అనే ముసుగు వేశారని తేటతెల్లమైంది! ముసుగు సరే… మరి అనుభవం సంగతేమిటో పవన్ సమాధానం చెప్పాలని పలువురు అభిప్రాయపడుతున్నారు!! అలా కాదు… జగన్ కు ఒక రూల్, తనకు ఒక రూల్ అని చెబుతారా? వేచి చూడాలి!!