Home రాజకీయాలు రహస్యం కాదు కదా… ఈ రచ్చేంది?

రహస్యం కాదు కదా… ఈ రచ్చేంది?

SHARE

ఈ లోకంలో ఎవరు ఎవరినైనా కలుసుకోవచ్చు.. ఎవరు ఎవరితోనైనా మాట్లాడొచ్చు. కాకపోతే ఈ విషయంలో ఒకరి మీటింగులకు మరొకరు వెళ్లడం వెళ్లకపోవడం అనేది ఆయా రాజకీయ పార్టీల రూల్స్ ని బట్టి ఉంటాయి కానీ.. సామాన్యులకు ఆ రూల్స్ ఏమీ ఉండవు కదా! పైగా దెబ్బతిని, మోసపోయి, కష్టాల్లో ఉన్న వ్యక్తి, ప్రభుత్వం నుంచి అర్ధాంతరంగా అన్యాయానికి గురైన వ్యక్తి… తనకు నష్టం జరిగిందని, కొండమీద వెంకన్న సొమ్ము దొంగిలించబడుతుందని బాదపడుతూ… ప్రతిపక్ష నేతను కలిశారు! ప్రభుత్వం తప్పు చేస్తే ఏ సామాన్యుడికైనా ఉన్న మరో ఆప్షన్ ప్రతిపక్షం! ఈ విషయంలో ఎవరికైనా ఒకటే రూల్ ఉంటుంది. ఈ విషయాలు మరిచిన కొందరు నాయకులు, కొన్ని (పసుపు) పత్రికలు, మీడియా సంస్థలు… ఎగిరెగిరి పడుతున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే… టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు.. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. టీటీడీలో అక్రమాలు సాగుతున్నాయని.. గుప్త నిధుల కోసం అక్రమంగా తవ్వకాలు జరిపారని.. శ్రీవారి ఆభరణాల్లో గులాబీ వజ్రం మాయమైందని.. దానిని దేశం దాటించేశారని ఆరోపణలు చేసిన ఆయన… టీటీడీలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై జగన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం తన వ్యక్తిగత సమస్యలను ప్రస్థవించడం.. మిరాశీ వ్యవస్థను కాపాడాలని విన్నవించడం వంటి చర్చలు జరిగినట్లు సమాచారం! ఈ క్రమంలో ఈ విషయంపై కంగారు పడి కథనాలు రాసేస్తున్న ఒక వర్గం మీడియా… రమణ దీక్షితులు ఏకాంతంగా జగన్ ను కలిశారు.. రాజకీయంగా ఈ విషయం చర్చనీయాంశం.. బీజేపీ మద్దతు వైకాపా స్నేహం అంటూ కథనాలు వడ్డించేస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సింది ఒకటే… జగన్ ను కలిసిన వ్యక్తి ఏ రాజకీయ పార్టీకీ చెందిన వారు కాదు! గౌరవప్రదమైన పని చేసుకుంటూ తాజాగా పని పోగొట్టుకున్న వ్యక్తి. రాష్ట్రానికి పెద్ద దిక్కు అయిన ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేనప్పుడు, చంద్రబాబుని ఎన్నిసార్లు అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వకపోయే సరికి.. విసిగి వేశారిన దీక్షితులు… ప్రతిపక్ష నేతను వచ్చి కలిశారు, తమ సమస్యలు చెప్పుకున్నారు. దీనిని కూడా రాజకీయ కోణంలో చూస్తున్న ఒక వర్గం మీడియా బెంబేలెత్తిపోతూ.. ఏదో జరిగింది, జరగబోతుంది, ఈ కలయిక కరక్ట్ కాదు అంటూ హడావిడి చేస్తుంది!

ఈ భేటీ అనంతరం స్పందించిన దీక్షితులు కూడా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు! “మా కష్టాలు చెప్పుకొనేందుకు సీఎం చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. ఎన్నోసార్లు విజయవాడకు వెళ్లి వచ్చాం. రమ్మని కూడా అనలేదు.. అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. మా కష్టాలు సీఎం తీరిస్తే ఆయన ఫొటోనే ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటాను. మాకు కావాల్సింది స్వామి వారి కైంకర్యం. ప్రశాంతంగా స్వామివారి పూజ చేసుకోవాలి. కడుపునిండా అన్నం తినాలి. ఏ పార్టీ అయితే మాకు ఏంటి? స్వామి వారి సొత్తును, పవిత్రతను కాపాడడం నాకు జన్మతః వచ్చిన బాధ్యత. దాని కోసం పోరాడుతూనే ఉంటా” అని చెప్పారు. పైగా… ఈ భేటీ రహస్యంగా జరిగితే దానిపై వక్రదృష్టితో చూసినా అర్ధం ఉంది కానీ… ఇలా బహిరంగంగా కలిసి, జరుగుతున్న అన్యాయాలపై ప్రతిపక్ష నేతకు ఫిర్యాదు చేసినా కూడా వక్ర దృష్టితో చూడటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

ఇదే విషయాలపై స్పందించిన మాజీ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావు ట్విట్టర్ లో తనదైన శైలిలో స్పందించారు! “రమణ దీక్షితులు గారు ప్రతిపక్ష నేత జగన్ గారిని బహిరంగంగా కలిసారు. ఒకరు ఇది ఆపరేషన్ గరుడలో భాగము అన్నారు. మరియొక తీవ్రవాది దీక్షితులుగారు జగన్ కు పాదాక్రాంతుడు అయ్యాడు అన్నాడు. వేరొక ఉగ్రవాది ఇరువురికి బంధుత్వం అంటగట్టాడు. ఒక చానల్ శ్రీ వైష్ణవులకు ఇది కూడని పని అని వైష్ణవ సంఘాలన్నాయని పేర్కొంది.” అని ప్రస్థావించారు!

నిజంగా దీక్షితులు అంత బలమైన వ్యక్తి, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే వ్యక్తి అయినప్పుడు.. అనుకున్నప్పుడూ.. చంద్రబాబే దీక్షితులకు అపాయింట్ మెంట్ ఇచ్చి ఉంటే బాగుండేది కదా! ఈ విషయాలను మరిచిపోతుంది ఆ వర్గం మీడియా!! మరో దౌర్భాగ్యకరమైన విషయం ఏమిటంటే… రమణ దీక్షితులు, వెంకన్న భక్తుల మనోభావాలు కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని టీటీడీ చైర్మన్ పలకడం! ఆయన ముసుగు తొలిగిందని టీడీపీ నేతలు నిస్సిగ్గుగా ప్రకటించడం! ఈ రేంజ్ లో టీడీపీ అండ్ కో ఎందుకు ఉలిక్కిపడుతుందో!!