Home రాజకీయాలు తెలుగు రాజకీయాల్లో “మోసపోయా”!

తెలుగు రాజకీయాల్లో “మోసపోయా”!

80
SHARE

సానుభూతి ఓట్లకోసం అనుకోవాలో లేక తమ చేతకాని తనాన్ని, తమ అసమర్ధతను పరోక్షంగా ఒప్పేసుకుంటున్నారని అనుకోవాలో అదీ గాక.. అలా అయినా జనాలకు అవతలి వ్యక్తి మోసగాడు అని నిరూపించాలనో తెలియదు కానీ… గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో “మోసపోయా” అనే మాట పదే పదే వినిపిస్తుంది. ఈ మోసపోవడాలేమిటో.. మోసం చేస్తుంది ఎవరో.. మోసపోయింది ఎవరో.. ఒకసారి పరిశీలిద్దాం! మోసం చేసేవాడు మోసగాడైనా తెలివైన వాడని అనుకోవాలా లేక మోసపోయిన వాడు అమాయక చక్రవర్తి అని సర్ధుకోవాలా? వ్యక్తుల తమ అసమర్ధత వల్ల మోసపోతే.. ఆ వ్యక్తికే నష్టం జరగాలి కానీ… వ్యవస్థ మొత్తానికి అన్యాయం జరిగితే దాన్ని ఏమనుకోవాలి? ఐదుకోట్ల ఆంధ్రుల జీవితాలు ఇలా మోసపోయేవారు, మోసం చేసేవారి చేతుల్లో పెట్టాలా?

నాలుగేళ్లపాటు హ్యాపీగా సాగిన బీజేపీ – టీడీపీ స్నేహం అటకెక్కింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి ఇప్పుడు తనను మోసం చేస్తున్నారని అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నిన్న మొన్నటివరకూ హోదా వద్దు ప్యాకేజీ ముద్దన్న చంద్రబాబు.. బీజేపీతో తెగే సరికి ఇలా ఫ్లేటు మార్చారు. రాబోయే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు బీజేపీవారు అడుగుతున్నందుకే బాబు కయ్యం పెట్టుకున్నారని ఒక సమాచారం. కానీ బాబు మాత్రం… బీజేపీ తనను మోసం చేసిందని చెప్పుకొస్తున్నారు. నిన్న మొన్నటివరకూ హోదా వద్దని చెప్పిన బాబు ఇప్పుడు ఇలా మాట్లాడి తమను ఏపీలో డ్యామేజ్ చేస్తూ మోసం చేస్తున్నారని అంటున్నారు.

వీరిద్దరికీ తోడుగా తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు! రాష్ట్రంలో 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకపోవడం జనసేన చేసిన పెద్ద తప్పిదమని చెప్పుకొస్తున్న పవన్‌ కల్యాణ్‌… 2014 ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం 5-10 సీట్లయినా జనసేన గెలుచుకునేదని, కలిసి ప్రయాణం చేద్దామని చంద్రబాబు అంటే సరేనన్నానని, కానీ ఆయనే అతిపెద్ద అవినీతిపరుడని తెలియక ఆయనను నమ్మి మోసపోయాను అని చెప్పుకొస్తున్నారు!!

ఎవరు మోసం చేశారు.. ఎవరు మోసపోయారు అనే విషయం కాసేపు పక్కనపెడితే… వీరందరి మాటలు వింటుంటే మాత్రం.. తాము అసమర్ధులము, నమ్మి మోసపోయే వాళ్లము అని చెప్పకనే చెబుతున్నట్లుంది. ఇలాంటి అసమర్ధులు, నమ్మి పోసపోయిన వారు ఐదుకోట్ల ఆంధ్రుల జీవితాలను ఉద్దరిస్తామని చెప్పుకొస్తున్నారు. వీరిని ప్రజలు మరోసారి నమ్మితే… మరోసారి మోసపోరని గ్యారెంటీ ఏమిటి? ఆ గ్యారెంటీ ఎవరు ఇస్తారు? ఒకసారి పొరపాటు చేస్తే, ఒక సారి నమ్మితే… ఆ నమ్మకం విలువ ఐదేళ్ల భవిష్యత్తు! ఈ విషయాలను గమనిస్తున్న ప్రజలు… ఎవరిని నమ్మాలి అని ఆలోచిస్తున్నారు! మోసం చేసిన వారిని నమ్మాలా.. మోస పోయిన అసమర్ధులను నమ్మాలా? ఈ విషయంలో జనాలు రెండింటిపైనా క్లారిటీగా ఉన్నారని… మిత్రులను మోసం చేసిన వ్యక్తి రేపు ప్రజలను మోసం చేయరా అని ఒకరంటుంటే… మోసపోయే అసమర్ధుడిని నమ్మి తమ భవిష్యత్తు ఎలా వారి చేతుల్లో పెట్టాలని మరికొందరు భావిస్తున్నారు!

ఏది ఏమైనా… మోసపోయాం, మోసపోయాం అని చెప్పుకుంటూ సానుభూతి ఓట్ల కోసమో, తమ చేతకాని తనాన్ని బయట పెట్టుకోవడం కోసమో ఈ నాయకులు పడుతున్న పాట్లు, చేస్తున్న ఫీట్లు జనాలకు కామెడీ అయిపోయాయనే అనుకోవాలి!!