Home రాజకీయాలు బాబుకు ప్రూఫ్ లు చూపిస్తున్న పవన్!

బాబుకు ప్రూఫ్ లు చూపిస్తున్న పవన్!

SHARE

తెగదెంపుల అనంతరం చంద్రబాబుపై సమయం చిక్కినప్పుడల్లా విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్… తాజాగా చంద్రబాబుకు సాక్ష్యాలు చూపిస్తూ, అవినీతిపై ప్రశ్నిస్తున్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా విశాఖ జిల్లా పాడేరు, మాడుగుల, నర్సీపట్నంలలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించిన పవన్… చంద్రబాబు చెబుతున్న “నిప్పు” కబుర్లపై ఫైరయ్యారు. తన పాలన పూర్తిగా అవినీతి రహిత పాలన, అన్యాయానికి దారిలేదు, అవినీతికి అవకాశం లేదు.. తాను నిప్పు అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు… హుకుంపేట మండలం గూడ గ్రామంలో జరుగుతున్న అవినీతి, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న విధానంపై వివరణ ఇస్తూ.. ప్రశ్నించే పనికి పూనుకున్నారు.

రాష్ట్రంలో అవినీతి లేదంటూ కబుర్లు చెబుతున్న ముఖ్యమంత్రి.. హుకుంపేట మండలం గూడ గ్రామానికి వచ్చి చూడాలని సూచించడంతో మొదలుపెట్టిన పవన్… వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నాయకుడు ఈ గ్రామంలో చేస్తున్న అక్రమ మైనింగ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు జరుగుతున్న నష్టంపై క్లారిటీ ఇచ్చారు. టీడీపీ నాయకుడు అక్రమంగా మైనింగ్‌ చేస్తూ ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.9 కోట్లు నష్టం కలిగించారని ఆరోపించిన పవన్… నిబంధనలకు విరుద్ధంగా నర్సీపట్నం ప్రాంతంలో లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి కేవలం రూ.70 కోట్ల ఆదాయం చూపిస్తూ నాయకులు మాత్రం రూ.3600 కోట్ల ఆదాయం పొందారని ఆరోపించారు. ఒక చిన్న గ్రామంలో ఇంత అన్యాయంఅ, అవినీతి జరుగుతుంటే… ఇక రాష్ట్రం మొత్తం పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చనే రేంజ్ లో మాట్లాడిన పవన్… ఈ గ్రామంలో జరుగుతున్నది అన్యాయం, అవినీతి కాదా? అని ప్రశ్నించారు.

ఈ రేంజ్ లో జరుగుతున్న అవినీతి, అన్యాయాలు… బాబు చెబుతున్న అవినీతి లెక్కల్లోకి రానిపక్షంలో… ఇక అవినీతికి నిర్వచనమేంటో చంద్రబాబే చెప్పాలని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ప్రకటనను ప్రస్థావించిన పవన్… విశాఖలో టీడీపీ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ స్వయంగా మంత్రి ప్రకటించారని, టీడీపీ పాలనలో అవినీతి జరుగుతుందనడానికి ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఈ రేంజ్ లో పవన్ స్పందించడం, అవినీతికి సాక్ష్యాలు ఇవిగో అని చంద్రబాబును నేరుగా టార్గెట్ చేసినా కూడా ఈ విషయంపై టీడీపీ నేతలు స్పందించకపోవడం గమనార్హం!!