Home రాజకీయాలు బాబు స్వయం సమర్ధతకు సవాల్!

బాబు స్వయం సమర్ధతకు సవాల్!

SHARE

బాబుపై చేసే విమర్శలందు.. మోత్కుపల్లి విమర్శలు వేరయా అన్నా అతిశయోక్తి కాదేమో! ఒకప్పుడు తెలంగాణలో టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న మోత్కుపల్లి.. ఇటీవల పార్టీ నుంచి వెలివేయబడిన సంగతి తెలిసిందే. అనంతరం ఎన్టీఆర్ వర్దంతి రోజు బాబుపై తీవ్ర విమర్శలు చేసి సంచలనం సృష్టించిన ఆయన… రోజు రోజుకీ బాబుపై విమర్శల డోసు పెంచుకుంటూ, కార్యకర్తలను, ప్రజలను ఆలోచింపచేసే సవాళ్లు విసురుతున్నారు. ఈ సవాల్ వల్ల ఇటు ప్రజలు, కార్యకర్తలు సైతం ఒకసారి గతానికి వెళ్లి… నిజమే కదా అనుకునే పరిస్థితి కల్పిస్తున్నారు! ఈ క్రమంలో తాజాగా చంద్రబాబుకు ఊహించని సవాల్ చేశారు మోత్కుపలి!

తనకున్న కోపమంతా చంద్రబాబునాయుడుపైన గాని తెలుగుదేశంపైన కాదు అనే సంకేతాలు నిత్యం ఇస్తూ.. పార్టీని ఒక్క మాట కూడా అనకుండా ఒక్క చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసి విమర్శిస్తూ వస్తున్న మోత్కుపల్లి… తాజాగా చంద్రబాబుపై నిప్పులు చెరుగుతూ సవాల్ విసిరారు. “చంద్రబాబుకు నిజంగా ఆత్మవిశ్వాసం, తన తెలివితేటలపైన నమ్మకం, అనుభవం వల్ల వచ్చిన జ్ఞానం ఉందనుకుంటే… నందమూరి తారకరామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి.. కొత్త పార్టీ పెట్టి నిజంగానే తాను సమర్థుడు అని నిరూపించుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగ సొంత పార్టీ పెట్టి నిలదొక్కుకుని తన సమర్థతను చాటుకోవాలి” అని వ్యాఖ్యానించారు.

చిత్రమేమిటంటే… ఈ సవాల్ ను చంద్రబాబు స్వీకరించరన్న విషయం ఈ సవాల్ చేసిన వారితో పాటు ఈ వార్త చదివిన వారందరికీ తెలుసు! అయితె… ఈ సవాల్ వల్ల… చంద్రబాబు సమర్ధుడు కాదు, ఆత్మవిశ్వాసం కలిగిన నేత కాదు, బాబుకి అనుభవం వల్ల వచ్చిన జ్ఞానం శూన్యం అని చెప్పాలనేది, మరోసారి నిరూపించే ప్రయత్నం చేయాలనేది మోత్కుపల్లి ఆలోచనగా తెలుస్తుంది!! ఈ సవాల్ ని బాబు స్వీకరించరెందుకంటే… కేవలం బాబు పేరు చెబితే ఓట్లు రావు! ఈ విషయం తనకు కూడా బలంగా తెలుసు కనుకే.. ఎన్టీఆర్ ఫోటొలకు దండలేసి ఆయన అభిమానులను ఏమార్చి బతికేస్తుంటాడు. ఈ విషయాలపై కూడా తనకు స్పష్టత ఉందని ప్రకటించిన మోత్కుపల్లి… “చంద్రబాబుకి స్వయం సమర్థత లేదు కాబట్టే సందర్భానుసారం ఎవరినో ఒకరిని వాడుకుని నిలబడుతూ ఉంటాడు.. తాజాగా నన్ను వాడుకుని వదిలేశారు.. ఇలా వాడి వదిలేయడం చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య” అని వ్యాఖ్యానించారు.

ఈ రేంజ్ లో చంద్రబాబుని టార్గెట్ చేసి ముందుకు పోతున్నారు మోత్కుపల్లి. మోత్కుపల్లి అన్నారని కాదు కానీ… ఈ విషయంలో చంద్రబాబు నిజంగా ఒక ఆలోచన చేసి, జేసీ దివాకర్ రెడ్డితో టీడీపీ సొంత ఆస్తి అని చెప్పించుకుని మురిసిపోవడం కాకుండా.. తానే సొంతంగా “సీబీఎన్ టీడీపీ” అనో “నారా టీడీపీ” అనో ఒక పార్టీ పెట్టి రంగంలోకి దిగితే మాత్రం.. చంద్రబాబు చాలా గ్రేట్ అని అంతా ఒప్పుకు తీరాలి!! బాబుకు ఆ సాహసం చేసే దమ్ము, స్వయం సమర్ధత లేవు కాబట్టే మోత్కు పల్లి ఈ రేంజ్ లో సవాల్ విసిరారని పలువురు అభిప్రాయపడుతున్నారు!!