Home రాజకీయాలు రమణ దీక్షితులు సవాల్‌ విత్ డెడ్ లైన్!

రమణ దీక్షితులు సవాల్‌ విత్ డెడ్ లైన్!

64
SHARE

టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ప్రభుత్వంపైనా, టీటీడీ పాలనపైనా ఆరోపణలు చేసిన ఆయన.. స్వామివారి నగలు, సంపద విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈ వ్యవహారం రోజు రోజుకీ ముదిరి పాకాన పడుతున్నా… చంద్రబాబు అండ్ కో మాత్రం రమణ దీక్షితులపై ఎదురు దాడిని మాత్రమే నమ్ముకుని ముందుకు పోతున్నారు. ఈ క్రమంలో రమణ దీక్షితులను టార్గెట్ చేసి.. అనేక బహిరంగ సభల్లో బాబు విమర్శలు చేశారు. ఈ క్రమంలో తిరుమల పవిత్రత సంరక్షణపై విశ్వ హిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సమావేశమై చర్చించిన అనంతరం స్పందించిన రంఅణ దీక్షితులు… ప్రభుత్వానికి సవాల్ విసిరారు!!

“సీబీఐ విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను. నాపై ఆరోపణలు చేసిన వారు సిద్ధమా?” అని టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు సవాల్‌ విసిరారు. జేఈఓలుగా పనిచేసిన బాలసుబ్రమణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజులు టీటీడీకి పట్టిన ఏలినాటి శనిలాంటి వారని తీవ్ర స్థాయిలో విమర్శించిన ఆయన… బాలసుబ్రమణ్యం హయాంలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేశారని, దీని వెనుక ఆయనకు లాభార్జన ఉందని ఆరోపించారు. ఈ క్రమంలో మరింత తీవ్రమైన ఆరోపణలు చేసిన దీక్షితులు… “వెయ్యికాళ్ల మండపాన్ని కాపాడాలని, మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా తప్పనిసరైతే మరోచోట నిర్మించాలని వినతిపత్రం ఇచ్చానని తెలిసిన అనంతరం వంశ పారంపర్యంగా ఉన్న తన ఇంటిని కూల్చివేసేయడమే కాకుండా.. ధర్మారెడ్డి పదవీకాలంలోనే తనపై రెండుసార్లు హత్యాప్రయత్నం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు!

అన్నపోటు వద్ద నిధి ఉందని బ్రిటీష్‌ శాసనంలోనే ప్రస్తావించారని చెబుతున్న దీక్షితులు… అక్కడ నిధుల కోసం తవ్వకాలు జరిపారని, ఆ అక్రమాలను బయటపెట్టినందుకే తనను ముందుగానే రిటైర్‌ చేశారని ఆరోపించారు. జేఈవోల నిరంకుశత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ఆయన తిరుమలలో వేంకటేశ్వరస్వామి నగల విషయంలో వస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. అక్కడితో ఆగని దీక్షితులు… ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోని పక్షంలో జూన్‌ 9న తిరుపతిలో సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. దీంతో అటు ప్రభుత్వానికి సవాల్ విసురుతూ డెడ్ లైన్ కూడా ఫిక్స్ చేసిన దీక్షితులు… ఈ వ్యవహారాన్ని ఎంత వరకూ తీసుకుని వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది!!